ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ నెల 28న అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు, తహసీల్దారులకు వినతిపత్రాలు విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఈ నెల 28న ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అందులో భాగంగా ర్యాలీలు నిర్వహించి, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేయన్నుట్లు చెప్పారు. ప్రజా ఉద్యమంకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అంశంపై ఇప్పటికే నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు. ఈ నెల 28న నిర్వహించే ప్రజా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన
రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన ఉందని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్రస్ లేని కంపెనీలకు విలువైన భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు.
వైద్యం ఊపిరి తీస్తున్నారు
కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మల్లాది విష్ణు అన్నారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు బంద్ అయ్యాయని, ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ
మాజీ ఎమ్మెల్యే, నందిగామ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు కనీసం రక్షిత మంచినీరు కూడా అందివ్వడం లేదన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.


