
ఎన్టీఆర్ జిల్లాలో 32 మలేరియా కేసులు
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 32 మలేరియా కేసులు ఉన్నాయని జిల్లా మలేరియా అధికారి మోతీలాల్ తెలిపారు. పెనుగంచిప్రోలు గ్రామంలోని తుఫాన్ కాలనీలో ఆయన మంగళవారం పర్యటించారు. డెంగీ లక్షణాలతో ఆదివారం మృతి చెందిన యువతి పెద్ది రూప కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇచ్చిన రిపోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం మలేరియా కేసులు 32, డెంగీ కేసులు ఏడు ఉన్నాయని తెలిపారు. టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నా యని పేర్కొన్నారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. పెద్ది రూప మెడికల్ రిపోర్టుల్లో టైఫాయిడ్‌తో పాటు కిడ్నీ సమస్యలతో మృతి చెందినట్లు ఉందన్నారు. తుఫాన్ కాలనీతో పాటు మోడల్ కాలనీలో ఐదు వైద్య బృందాలు ఇంటింటి సర్వేతో పాటు రక్త నమూనాలు సేకరిస్తున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీ సహకారంతో దోమ లార్వా నాశనం చేసేందుకు అబేట్‌తో పాటు ఫాగింగ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, వైద్యాధికారి నాగలక్ష్మి, జగ్గయ్యపేట డివిజన్ సబ్‌యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సీహెచ్‌ఓ వెరోనిక, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు.