
దూసుకొస్తున్న మృత్యువాహనాలు
ఓవర్ లోడింగ్‌తో మెటల్, గ్రావెల్, బూడిదను తరలిస్తున్న టిప్పర్ లారీలు వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు టిప్పర్ లారీలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్న వైనం నిద్రమత్తు వీడని రవాణా శాఖ అధికారులు
జి.కొండూరు: అక్రమ మైనింగ్ క్వారీల నుంచి మెటల్, కంకర, గ్రావెల్, బూడిద చెరువు నుంచి బూడిద రవాణా చేసే వెయ్యికి పైగా టిప్పర్ లారీలు ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. లారీలు బోల్తా పడడం, ఓవర్‌టేక్ చేస్తూ ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మారి జీవనోపాధిని కోల్పోతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న టిప్పర్ల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఓవర్ లోడింగ్‌తో ప్రమాదం
ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో నిర్వహిస్తున్న రాతి క్వారీలలో కంకర, భారీ బండరాళ్లు, గ్రావెల్‌ను తరలించేందుకు రోజుకి 500 టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద చెరువు నుంచి బూడిదను తరలించేందుకు రోజూ 400 లారీల వరకు తిరుగుతుంటాయి. ఈ క్వారీలు, బూడిద చెరువు నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలు, రహదారులకు నిత్యం వందలాది లారీలతో మెటల్, గ్రావెల్, బూడిద తరలిస్తుంటారు. టిప్పర్ లారీకి సైజును బట్టి 25 నుంచి 30 టన్నులకు మించి రవాణా చేయడానికి వీలు లేకపోయినప్పటికీ ఎక్కువ కిరాయి కోసం 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు కూడా లోడు చేసి రవాణా చేస్తున్నారు. డ్రైవర్‌లు గ్రామాల్లో చిన్న రోడ్లలో సైతం మితిమీరిన వేగంతో టిప్పర్ లారీలను నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ నెల 2న మునగపాడు చెరువు వద్ద కంకర లోడుతో వెళ్తూ బోల్తాపడి దగ్ధమైన టిప్పర్ లారీ
జూన్ 6న ఇబ్రహీంపట్నం ట్రక్కు టర్మినల్ వద్ద బోల్తాపడిన బూడిద లోడుతో ఉన్న టిప్పర్ లారీ
టిప్పర్ మే సవాల్
గ్రావెల్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి
టిప్పర్ లారీలను చూస్తే భయమేస్తోంది
గ్రావెల్, కంకర లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్ లారీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎక్కువ ట్రక్కులు రవాణా చేస్తే కమీషన్ ఎక్కువ వస్తుందని డ్రైవర్‌లు వేగంగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి.
–పెయ్యల ప్రతాప్, గ్రామస్తుడు,
వెలగలేరు
జి.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని గ్రావెల్ లారీ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే... జి.కొండూరు మండలం వెల్లటూరుకు చెందిన తొర్లికొండ శివయ్య(60) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య గురువారం ఉదయం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పని కోసం కవులూరు వెళ్తున్నాడు. కవులూరు గ్రామ శివారులోకి రాగానే వెనక నుంచి గ్రావెల్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్ రోడ్డు మార్జిన్ వైపు పడిపోగా వెనక కూర్చున్న శివయ్య లారీ కింద పడిపోయాడు. శివయ్యపైకి లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివమ్మ అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.

దూసుకొస్తున్న మృత్యువాహనాలు

దూసుకొస్తున్న మృత్యువాహనాలు