
ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి!
పెడన: బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి. గతంలో మాట ఇది. ప్రస్తుతం బోధనేతర పనులతో సతమతమవుతున్నారు. ‘తమ పిల్లలకు పాఠాలు చెప్పుకోనీయండి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తం చేస్తున్న మెసేజ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలో ఉపాధ్యాయులు ఎన్డీయే కూటమి సర్కారు ప్రవేశపెడుతున్న యాప్‌లు, ఆన్‌లైన్ వర్క్‌లు, ఇతర బోధనేతర కార్యక్రమాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కే పరిస్థితి స్పష్టంగా కనపడుతోందని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఎవరూ బహిరంగంగా చెప్పడానికి, మీడియా ముందు మాట్లాడటానికి భయపడుతున్నారు. మనకెందుకులే అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో వారి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వడ్డ్ అయిన మెసేజ్‌లో వివరాలను పరిశీలిస్తే తెలుస్తుంది
స్కూలు పునః ప్రారంభం నుంచే బోధనేతర పనులు
విద్యార్థులకు కిట్లు పంపిణీ, వాటి వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ చేశారు. ఆ తరువాత మెగా పేరంట్స్ సమావేశం. దీనికి సంబంఽధించిన అన్ని అంశాలను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడం. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర యాప్. పాఠశాలలో పరిసరాల పరిస్థితిని ఫొటోలు తీసి ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కాలేదు. ఒక పక్క అప్‌లోడ్ చేయకపోతే ఎందుకు చేయలేదంటూ ఫోన్లు. మరోవైపు అప్‌లోడ్ చేస్తూనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాజాగా విద్యార్థులకు అందజేసిన కిట్లు, పుస్తకాలు, బ్యాగులు ఇచ్చినందుకు వాళ్ల తల్లిదండ్రులు, పిల్లల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలి. వీటిని మళ్లీ యాప్‌లో అప్‌లోడ్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది.
యాప్‌లో 18 కోర్సులు
ఉమ్మడి జిల్లాలో సుమారు 14000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఐ గాట్ కర్మయోగి అనే యాప్‌లో 18 కోర్సులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 28 నుంచి లీడర్‌షిప్ ట్రైనింగ్. సెకండ్ స్పెల్ ట్రైనింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. మండల స్థాయిలో హెచ్‌ఎంలు, ఎంఈవోలు గంటల తరబడి సమావేశాలు వినాల్సి వస్తోంది. అదీ కాకుండా ఈ ఏడాది కొత్తగా ఎగ్జామ్స్‌లో పిల్లవాడు రాసిన ఆన్సర్ షీట్స్‌ను ఫొటో తీసి లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో హైస్కూల్ టీచర్లు 500 నుంచి 1000 వరకు ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇవి ఎప్పటికి అప్‌లోడ్ అవుతాయో.. కావో తెలియని దుస్థితి.
ఇంకా పెరిగాయి
బోధనేతర పనులతో సతమతం మమ్మల్ని పాఠాలు చెప్పుకోనీయండి వాట్సాప్ గ్రూపుల్లో ఉపాధ్యాయులు ఆవేదన టెన్షన్ టెన్షన్‌గా స్కూళ్లకు వెళ్తున్న వైనం
ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలుండవని అనుకున్నామని, కానీ బోధనేతర కార్యక్రమాలు ఇంకా పెరిగాయని వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన వెలిబుచ్చుతున్నారు. విద్యాశాఖ మంత్రి గత కొద్ది నెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. అధికారులతో ఉపాధ్యాయ సంఘాలు సమావేశమైనా ఎలాంటి ఉపయోగం ఉండదని, ఇప్పటికై నా విద్యా శాఖా మంత్రి ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాట్సాప్ గ్రూపుల్లో పేర్కోవడం విశేషం.

ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి!