
కాపులను విస్మరిస్తున్న ‘కూటమి’
● ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు ● కాపునాడు జిల్లా కన్వీనర్ వి.వి.రమణమూర్తి
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తోందని కాపునాడు జిల్లా కన్వీనర్ విన్నకోట వెంకటరమణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఎన్నికలు ముందు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తుంగలోకి తొక్కారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పిన నాయకులు ఆ దిశగా అడుగులు పడటం లేదన్నారు. మచిలీపట్నం నగరంలో ఈ నెల 16వ తేదీన జాబ్‌మేళా నిర్వహించి నగరంలోని పలు షాపుల్లో ఉద్యోగాలు ఇప్పించి వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తమ సామాజికవర్గం బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. రెడ్‌బుక్ పేరుతో అమాయకులను వేధిస్తూ అక్రమంగా కేసులు కడుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు కాపు సామాజికవర్గంపై ఎంతో ప్రేమ ఒలకపోసి అధికారంలోకి వచ్చిన అనంతరం వారిని వదిలేశారని ధ్వజమెత్తారు. ఎంతో మంది పేద కుటుంబాలను, చిరువ్యాపారులను రోడ్డున పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ సామాజిక వర్గంతో పాటు పేద, బడుగు, బలహీనవర్గాల వారు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
గ్యాస్ లీక్.. గృహోపకరణాలు దగ్ధం
నందిగామ టౌన్: గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో గృహోపకరణాలు దగ్ధమైన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని రైతుపేట నారాయణ స్వామి కాంప్లెక్స్ రెండో అంతస్థులోని 201 ఫ్లాట్‌లో సోమవారం సాయంత్రం వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ గౌతంబాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనలో రూ. రెండు లక్షల విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్లు ఫ్ల్లాట్‌లో అద్దెకుంటున్న శివబాబు తెలిపారు.
ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయండి
బందరులో పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
మచిలీపట్నంటౌన్: ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ సేవలు అందించేందుకు తప్పనిసరి చేసిన ముఖ గుర్తింపు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను రద్దు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం స్థానిక పోర్ట్ రోడ్డులోని పీడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ విధానంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సర్వర్ పని చేయక ఎఫ్‌ఆర్‌ఎస్ పడక సమయం వృథా అవుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై వేధింపులను నివారించడానికి అధికారులు స్పందించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి, సీఐటీయూ నేత సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం ప్రాజెక్టు అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ నాంచారమ్మ, కార్యదర్శి రెజీనారాణి, సెక్టర్ నాయకురాలు లక్ష్మి, సీతారత్నం, విజయశ్రీ, సుజాత, సౌజన్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు.