
పోలీస్ గ్రీవెన్స్‌కు 72 ఫిర్యాదులు
డీసీపీ ఉదయరాణి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌కు 72 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డెప్యూటీ పోలీస్ కమిషనర్ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడారు. వికలాంగులు, వృద్ధుల వద్దకు ఆమె వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదును తీసుకున్నారు.
చట్టపరిఽఽధిలో సమస్యలకు పరిష్కారం
కోనేరుసెంటర్: మీ కోసంలో అందిన అర్జీలను చట్ట పరిఽఽధిలో విచారణ జరిపించి బాధితులకు సత్వర న్యాయం అందడానికి చర్యలు తీసుకుంటామని కృష్ణా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో ఆయన పాల్గొన్నారు.
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా మీకోసంలో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఫిర్యాదు ఎలాంటిదైనా విచారణ జరిపించి బాధితులకు అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు.
ఫిర్యాదుల్లో కొన్ని
●తోట్లవల్లూరుకు చెందిన ప్రత్యూష అనే బాధితురాలు ఎస్పీతో తన భర్త ఏడాది క్రితం క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు తెలిపింది. తనకు ఇద్దరు పిల్లలు ఉండగా భర్త చనిపోయిన నాటి నుంచి అత్తమామలు తనతో పాటు తన పిల్లలను ఇంటి నుంచి గెంటేసినట్లు చెప్పారు. జరిగిన అన్యాయంపై పెద్దలతో మాట్లాడించినా అత్తమామలు, ఆడపడుచు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రాధేయపడింది.
●గుడివాడకు చెందిన మురళీ అనే ఓ తండ్రి ఎస్పీని కలిసి తన కుమార్తెను కొందరు సామాజిక మాధ్యమాల్లో అల్లరి చేస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ వాపోయారు. ఆమెను మానసికంగా వేధిస్తూ అవమానిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తన బిడ్డకు రక్షణ కల్పించాలని కోరారు.
●కంకిపాడుకు చెందిన రవి ప్రైవేట్ ఉద్యోగి. రెండు నెలల క్రితం సోషల్‌మీడియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు కనిపించగా సంబంధిత వ్యక్తులతో మాట్లాడి ప్రాసెసింగ్ ఫీజు కింద లక్ష రూపాయలు ఇచ్చినట్లు ఆయను చెప్పారు. ఇంత వరకు వారి నుంచి సమాధానం రావడం లేదని తనకు న్యాయం చేయాలని కోరారు. అర్జీలపై స్పందించిన ఎస్పీ విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.