
అదుపుతప్పి పంట కాల్వలో బూడిద లారీ
ఇబ్రహీంపట్నం: బూడిద చెరువు నుంచి బూడిద లోడింగ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఖిల్లా రోడ్డు పక్కన పంట కాల్వలోకి సోమవారం దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అతివేగంతో ప్రమాదానికి గురైంది. నిమ్రా, నోవా కళాశాలల విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో వర్షం కారణంగా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఖిల్లా రోడ్డులో బూడిద రవాణా లారీల రద్దీతో ప్రజలు, కళాశాల విద్యార్థులు, కొండపల్లి ఖిల్లా పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరోడ్డులో ప్రయాణించాల్సి వస్తోంది. లారీలు అతివేగానికి కళ్లెం వేయాలని పలుమార్లు ఎన్టీటీపీఎస్ అధికారులకు ప్రజలు చెప్పినా వారు స్పందించక లారీల వేగాన్ని నియంత్రించే వారు కరువైయ్యారు. ఎట్టకేలకు రెండు జేసీబీలు, ఒక పొక్లెయిన్‌తో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.