
భార్య..అత్తను తీసుకురండి.. లేదంటే చచ్చిపోతా!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): నా భార్య నాకు కావాలి... మా అత్తతో నేను ఇప్పుడే మాట్లాడాలి.. వాళ్లిద్దరూ ఇక్కడకు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ ఓ యువకుడు హల్‌చల్ చేసిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన బేతంచర్ల వెంకట జానకీరామ్(26)కు గతేడాది వైఎస్సార్ కాలనీకి చెందిన చింతల వెంకటదేవితో వివాహమైంది. అయితే పెళ్లయిన కొన్ని నెలల నుంచే భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో రెండురోజుల కిందట వారి మధ్య మరింత గొడవ చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన జానకీరామ్ శుక్రవారం న్యూఆర్‌ఆర్‌పేటలోని తన తల్లి వద్దకు వచ్చి ఆమెను ఇంటిలో నుంచి బయటకు పంపించి తలుపులు వేసుకొని లోపలే ఉన్నాడు. తన భార్య, అత్తను పిలిపించి మాట్లాడాలని లేనిపక్షంలో నేను చనిపోతానంటూ కేకలు వేస్తూ వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్‌చేస్తూ నిప్పంటించుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న సింగ్‌నగర్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హూటాహూటిన సంఘటనా స్థలానికి చేరుకొని అతనితో మాట్లాడేందుకు చాలా ప్రయత్నం చేశారు. కాసేపటికి గ్యాస్ అయిపోవడంతో జానకీరామ్ ఇంట్లోని నూనె తన ఒంటిపై పోసుకొని చనిపోతానంటూ హడావుడి చేశాడు. ఎట్టకేలకు పోలీసులు అతని భార్య, అత్తను పిలిపించి మాట్లాడతామని హామీ ఇచ్చి బయటకు తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. పోలీసులు జానకీరామ్ తల్లి, భార్య, అత్తను పిలిపించి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ఇంటి తలుపులు మూసివేసి.. గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి హల్‌చల్. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు