
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలి
కలెక్టర్ లక్ష్మీశ
నందిగామరూరల్: ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని పెద్దవరం గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేక థీమ్‌తో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ భాగమైందని ఇలానే కొనసాగితే పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదని భావితరాల మనుగడ ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్‌కు బదులు క్లాత్, జూట్, పేపర్ బ్యాగ్‌ల వినియోగాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ చట్టరీత్యా నేరం..
120 మైక్రాన్‌ల కంటే తక్కువ మందమున్న పాలిథీన్ కవర్లు వినియోగించినా చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. తడి, పొడి చెత్తను సక్రమంగా క్రమశిక్షణతో, నిబద్దతతో వేరు చేసి ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్న 12 మందికి మొక్కలు, సర్టిఫికెట్‌లు, జ్యూట్ బ్యాగులను అందజేశారు. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంద్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, డీపీవో లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ నాంచారావు, డీఎంహెచ్‌వో సుహాసిని, డీఎల్‌పీవో రాఘవన్, సర్పంచ్ బాణావత్ చిన్నదేవి, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.