
సీలింగ్‌పై నుంచి జారిపడి కార్మికుడు మృతి
వీరపనేనిగూడెం(గన్నవరం): మండలంలోని వీరపనేనిగూడెంలో సీలింగ్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తూ జారీపడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటనపై మంగళవారం ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని గొల్లనపల్లికి చెందిన కర్రే రామలక్ష్మణ్(32) వీరపనేనిగూడెంలోని పీఎస్‌ఆర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తోటి వర్కర్లతో కలిసి సీలింగ్ రిపేర్ నిమిత్తం సోమవారం సాయంత్రం రేకుల షెడ్డుపైకి ఎక్కాడు. అయితే పైబర్ షీట్‌పై కాలువేసిన రామలక్ష్మణ్ ప్రమాదవశాత్తూ 30 అడుగుల ఎత్తుపై నుంచి కిందకు పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామలక్ష్మణ్‌ను చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్కూరు ఎస్‌ఐ సురేష్ చావ తెలిపారు.