రెడ్‌బుక్ లాఠీ
● ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా లాఠీ.. హుందాతనం కోల్పోతున్న ఖాకీ ● ఫలితంగా ఎన్టీఆర్ జిల్లాలో పెరిగిన రౌడీ, కేడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠాలు ● శాంతిభద్రతలను విస్మరించి, కూటమి నేతల అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న పోలీసులు ● ప్రజాక్షేత్రంలో పరువు పోగొట్టుకుంటున్న పోలీస్ కమిషనరేట్
సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లతో మొదలు..
ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి పాలనపై సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు గొంతు విప్పారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రాం, ఎక్స్, యూ ట్యూబ్, వాట్సాప్ వేదికగా ప్రశ్నించడం ఆరంభించారు. రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలు విజృంభి స్తాయని గ్రహించిన కూటమి నేతలు వారిపైకి పోలీస్‌లను ఉసిగొల్పారు. ఫిర్యాది ఎవరో తెలియకుండానే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సోషల్‌మీడియా ఖాతాలపై కేసులు నమోదయ్యాయి. పదేళ్ల క్రితం చేసిన పోస్ట్ ఆధారంగా కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా సైబర్ పోలీస్ స్టేషన్‌లో వారం రోజుల వ్యవధిలో 300లకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు రెండు వేల మందిని 41(ఏ) నోటీసులతో స్టేషన్‌కు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రెండు వేలకు పైగా కేసులు నమోదు చేశారు. వీటిలో చిన్నారులు, మహిళలపై అసభ్యకరంగా పోస్ట్ చేసిన ఖాతాలకు మినహా అన్ని కేసులు న్యాయస్థానంలో నిలబడలేకపోయాయి.
ప్రశ్నించే
గొంతుకను
నొక్కేస్తున్న
పోలీసులు
విజయవాడ: ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం కీలకపాత్ర పోషిస్తుంటాయి. తెలిసో.. తెలియకో అధికార పక్షం చేసే కొన్ని తప్పులను నిలదీసి, గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. అయితే అధికార పక్షం చేసే తప్పులను ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. భారత రాజ్యాంగం స్థానంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం, దానికి పోలీసులు వంతపాడటం సమాజ తిరోగమ నానికి దారితీస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీలు అలవికానివని, అమలుపై ప్రతిపక్షం, ప్రజా సంఘాలు కచ్చితంగా నిలదీస్తాయని కూటమి నేతలకు ముందే తెలుసు. ప్రశ్నించే ముందుగానే ఆ గొంతులను నొక్కేసే వ్యవహారానికి కూటమి శ్రీకారం చుట్టింది. అందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌ను పావుగా వాడుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పేట్రేగిన దొంగలు, రౌడీలు, కేడీలు
కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల్లోనే పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నుంచి ఎస్‌ఐ స్థాయి వరకు చకాచకా బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో పోస్టింగ్‌లు పొందిన పోలీసు అధికారులు కేవలం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల దినచర్య లపై దృష్టి పెట్టారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితోపాటు నగరంలోని సీసీ కెమెరాలను సైతం ప్రతిపక్షం నేతల వైపే తిప్పారు. తమపై పోలీసుల నిఘా లేకపోవడంతో దొంగలు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. 2024 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విజయవాడలో 2,500 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. చైన్‌స్నాచింగ్, గంజాయి సరఫరా విచ్చలవిడి అయింది. 2024 జూన్ నుంచి 2025 మే నెల వరకు జిల్లాలో 989 పరస్పర దాడుల కేసులు, 1,320 కబ్జా కేసులు, 1,662 మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి కేసులు, 110 ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, 1,407 రోడ్డు ప్రమాదాల కేసులు, 323 సైబర్ కేసులు, 550 చీటింగ్ కేసులు, 142 డ్రగ్స్ సరఫరా కేసులు పోలీస్ కమిషనరేట్‌లో నమోదయ్యాయి. 38 హత్య కేసులు, 112 హత్యాయత్నం కేసులు, 27 తీవ్రమైన దాడుల కేసులు, 791 స్వల్పదాడుల కేసుల నమోదయ్యాయి. 18 మంది మహిళలు హత్యకు గురవగా, వరకట్నం వేధింపులకు ఐదుగురు బలయ్యారు. 45 మంది మహిళలు, యువ తులపై లైంగికదాడులు జరగ్గా, 836 మంది గృహి ణులు వరకట్నం వేధింపులు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థల్లో సైతం ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని 394 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇక చిల్లర దొంగతనాలకు హద్దేలేకుండా పోయింది. చోరీలను అదుపు చేయలేక రక్షణ వ్యవస్థ చేతులెత్తేసింది. మొత్తంగా కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతకు పెనుముప్పు తీసుకొచ్చెలా 3,437 మంది రౌడీలు, కేడీలను రెడ్‌బుక్ రాజ్యాంగం తయారు చేసింది.
పోలీసు అధికారులకు కోర్టుల్లో చీవాట్లు
కూటమి నేతల దృష్టిలో పడి మంచి పోస్టింగ్ కొట్టేద్దామని అత్యుత్సాహంతో అక్రమ కేసులు బనాయించిన పలువురు పోలీసు అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్న ఘటనలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. రెడ్ బుక్ మోజులో పడి బీఎన్‌ఎస్‌ను అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి న్యాయస్థానంలో కొందరు పోలీసు అధికారులు చీవాట్లు తిన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై వైఎస్సార్ సీపీ నాయకులు సైతం తిరిగి కేసులు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసులు న్యాయస్థానం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో అభియో గాలు నిరూపితమైతే తమ ఉద్యోగాలకే ముప్పు వాటిల్లుతుందనే భయం సదరు పోలీసు అధికారులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఆయా కేసులను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుల కాళ్లావేళ్లా పడుతున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెంనకు చెందిన శ్రీనివాసరావుకు విజయవాడ సైబర్ పోలీసుల నుంచి నోటీసు వెళ్లింది. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌ను పోస్ట్ చేశారని, విచారణకు రావాలని ఆ నోటీసు సారాంశం. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు చెందిన సుమారు 150 మందికి కూడా ఈ నోటీసులు వెళ్లాయి. వారంతా పోలీసులు చెప్పిన తేదీకి విజయవాడ సైబర్ స్టేషన్‌కు విచ్చేశారు. స్వతహాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులైన వీరంతా ‘తెలంగాణ వైఎస్సార్ కుటుంబం’ పేరుతో నడిచే వాట్సాప్ గ్రూప్ సభ్యులు. గ్రూపు ‘డీపీ’గా వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నందుకు తమను విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని వారంతా అప్పట్లో గగ్గోలు పెట్టారు. ఇదేం అన్యాయం అంటూ ప్రశ్నించడంతో పోలీసులు వారిని వదిలేశారు.
విజయవాడలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయనడానికి ఈ నెల ఎనిమిదో తేదీన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే నిదర్శనం. పట్టపగలు, నడిరోడ్డుపై యువకులు మద్యం మత్తులో కత్తులు, బీరు సీసాలతో పరస్పర దాడులు చేసుకుని స్థానికులను భయాందోళనకు గురి చేశారు. బ్యాచ్‌లర్ పార్టీలో తలెత్తిన ఈ వివాదం కత్తులు, బీర్ సీసాలతో దాడికి దారితీసింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే దాదాపు గంటన్నర పాటు ఈ రాద్ధాంతం జరిగినా, గొడవ సద్దు మణిగే వరకు పోలీసులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిచ్చింది.
విలేకరులపై అక్రమ కేసులు,
కూటమి పాలకుల అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే విలేకరులపైనా పోలీస్ శాఖ జులుం ప్రదర్శిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని వారాలకే నందిగామలో కూటమి నేతల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సాక్షి విలేకరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బుడమేరు వరదల్లో పాలకుల వైఫల్యాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆస్తి, ఆర్థిక నష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలి సిందే. ఆ తరువాత కూటమి నేతల మౌఖిక ఆదేశాలతో పోలీసులు అమాయక ప్రజలపై విరుచుకుపడుతున్న తీరును సాక్షి బహిర్గతం చేస్తోంది. ఈ నేపథ్యంలో సాక్షి గొంతుకను నొక్కేందుకు పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపైకి పోలీసులను కూటమి నేతలు ఉసిగొల్పారు. ముందస్తు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఆయన ఇంట్లో తనిఖీలు చేసి ప్రజాస్వామ్యాన్ని పోలీసు శాఖ అపహాస్యం చేసింది.
రెడ్‌బుక్ లాఠీ
రెడ్‌బుక్ లాఠీ


