త్యాగానికి ప్రతీక బక్రీద్
లబ్బీపేట(విజయవాడతూర్పు): త్యాగనిరతిని, దాన గుణాన్ని పెంపొందించేదే బక్రీద్ పండుగ అని జమాతే ఇస్తామీ హింద్(జేఐహెచ్) మహమ్మద్ రఫీక్ అహ్మద్ అన్నారు. లబ్బీపేట ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం బక్రీద్ సామూహిక నమాజు జరిగింది. వేలాది మంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ ఇంటిల్లిపాదీ జరుపుకునే పండుగలో బీదలు, బంధువులను, ఇరుగుపొరుగువారిని భాగస్వాములుగా చేసుకుని, మీకున్నంతలో దానమివ్వాలని ఇస్లాం చెబుతోందన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనే
ఒక మత సంస్థ ఆస్తులను కబ్జాలు చేసుకునేలా ప్రోత్సహించే చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 ను వెంటనే రద్దు చేయాలని మహమ్మద్ రఫీక్ అహ్మద్, ఇతర వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం, మైనార్టీ మతాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం, దేశ పౌరులందరకీ సమాన హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల బాధ్యత అన్నారు. ముస్లింల ధార్మిక సామాజిక అంశాలు భావి తరాల భవిష్యత్తు వక్ఫ్ బిల్లుతో ముడిపడి ఉన్నాయన్నారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం అయోధ్య మినహా మరి ఎక్కడా ఉలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదని, 1947 ఆగస్టు 15న ఆయా ప్రార్థనా స్థలాలలో ఉన్న యథాతథ స్థితిని కొనసాగించాలి వారు పేర్కొన్నారు. ముస్లింలను వేధించటమే ధ్యేయంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. అనంతరం ముఫ్తి హబీబ్ ఉరూ ప్రసంగం చేసి, నమాజ్ చదివించారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాలేషావలి, షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రశాంతంగా సామూహిక నమాజు నిర్వహించుకునేందుకు సహకరించిన నగరపాలక సంస్థ, పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సభ్యులు ఎండీ ఇర్ఫాన్, సయ్యద్ ఇంతియాజ్, ఎండీ అన్వర్ పాషా, షేక్ వలి, మఖ్బూల్ అహ్మద్ నద్వి తదితరులు పాల్గొన్నారు.
ఐజీఎంసీ స్టేడియంలో ఘనంగా సామూహిక ఈద్‌నమాజ్ వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ ఉల్లంఘనే
బక్రీద్ ప్రార్థనల్లో చిన్నారులు
త్యాగానికి ప్రతీక బక్రీద్


