
రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం
రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
పామర్రు: ప్రస్తుతం రాష్ట్రంలో రైతులందరూ అకాల వర్షాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారని, వీరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కృష్ణాజిల్లా పామర్రులో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం, మినుములు, మొక్క జొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు అయిన కాడికి పంటను తెగనమ్ముకుని నష్ట పోతున్నారని వివరించారు. రోజురోజుకీ మినుముల ధర తగ్గిపోతున్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల కూటమి నేతలకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ అండగా ఉంటూ పండిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించామని గుర్తు చేశారు.
స్పందించకపోతే ఉద్యమమే..
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్వహించేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు
కోనేరుసెంటర్: భద్రతా దళాల ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరితమైన సమాచారాన్ని షేర్ చేసినా, పోస్ట్ చేసిన ఆడియో, వీడియో మెసేజ్‌ల రూపంలో గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్‌రావు హెచ్చరించారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే గ్రూపుల్లో షేర్ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా జరిగితే మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసిన వ్యక్తులతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడమని హెచ్చరించారు.
జగదీష్ నల్లూరికి
లెజెండరీ అవార్డు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటీఎస్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట జగదీష్ నల్లూరికి లెజెండరీ అవార్డు లభించింది. హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2025లో ఈ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతుల మీదుగా వెంకట జగదీష్ నల్లూరి ఈ అవార్డు అందుకున్నారు. మీడియా, ప్రకటన రంగానికి చేసిన అసాధారణ సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. నలభై ఏళ్లకు పైగా అనుభవంతో, వెంకట జగదీష్ ప్రాంతీయ ప్రకటన రంగంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన అనేక ప్రభావవంతమైన ప్రచారాలను ఆయన నడిపారు. ఈ సందర్భంగా వెంకట జగదీష్ మాట్లాడుతూ హైబిజ్ టీవీ నుంచి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
క్రికెట్ అండర్–19
ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–19 పురుషులు వన్డే, మల్టీ డేస్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. 2025–26 సీజన్ కోసం మల్టీ డేస్ జట్టుకు రాజేష్ (కెప్టెన్), కార్తికేయ, కార్తికేయవర్మ, హర్షసాయిసాత్విక్, భానువరప్రసాద్, హరిదుర్గామణికంఠ, నిఖిల్, అఖిల్, ఆకర్ష్, ధీరుడు, గోవతం, యశ్వంత్, లలిత్, శ్రేయేష్, ఆదర్శ్, బవానీప్రసాద్.. వన్డే జట్టుకు రాజేష్(కెప్టెన్), కార్తికేయ, హేమంత్, హర్షసాయిసాత్విక్, భానువరప్రసాద్, రెనేష్, నిఖిల్, విఘ్నేష్, ధీరుడు, గోవతం, యశ్వంత్, లలిత్, ఆదర్శ్, శ్రేయేష్, రణధీర్, అవినాష్‌లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం