
రైతులకు అకాల కష్టం
● పసుపు, మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ ● ధర లేక ఇప్పటికీ కల్లాల్లోనే ఉన్న పంట దిగుబడులు ● ఆపై వెంటాడుతున్న అకాల వర్షాలు
కంకిపాడు: అకాల వర్షం కృష్ణా జిల్లా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చిన పంటను కాపాడుకోవటానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండిన పంట వర్షానికి దెబ్బతినకుండా సంరక్షించుకోవడానికి రైతులు నానా పాట్లు పడు తున్నారు. ధర లేక కల్లాలు, ఖాళీ స్థలాల్లోనే పంట ఉత్పత్తులు రాశులుగా పోసి ఉండటంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. వర్షాల వల్ల మార్కెట్ ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పసుపు, మొక్కజొన్నకు తప్పని నష్టం
ఈ సీజన్‌లో మొక్కజొన్న, పసుపు రైతులకు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలతో పాటుగా లంక ప్రాంతాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంట ఇంకా కల్లాల్లో రాశులు, పంట చేను మీద ఉంది. గాలులు, భారీ వర్షానికి చాలా చోట్ల పంట నేలవాలిపోయింది. మొక్కజొన్న కండెలు వర్షానికి తడిచిపోవ టంతో నాణ్యత దెబ్బతింది. రాశులు మీద ఉన్న గింజలు వర్షానికి నాను తున్నాయి. జిల్లాలో 5,031 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. రైతులు కొమ్ములను ఉడకబెట్టి ఎండబెట్టారు. పూర్తి స్థాయిలో ఎండబెట్టి మార్కెట్‌కు తరలించే క్రమంలో విడవకుండా పడుతున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతింటోంది. కొమ్ములు కటిక (నలుపు) వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా అటు మొక్కజొన్న, ఇటు పసుపు కొమ్ములను సంరక్షించుకోవడానికి రైతులు నిత్యం కల్లాలు, ఖాళీ వెంచర్లలో పంట మధ్యే గడుపుతున్న దుస్థితి. చినుకు పడితే పరదాలు కప్పటం, తెరపివ్వగానే ఎండ పొడకు పంటను ఎండబెట్టే పనుల్లో నిమగ్నం కావాల్సిన పరిస్థితి.
ధరపై దిగులు
ఈ విపత్కర పరిస్థితుల్లో మార్కెట్ ధరపై రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్న రూ.2 వేల నుంచి రూ.2100 వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వదలకుండా పడుతున్న వానలకు గింజ నాణ్యత దెబ్బతింటే ధర మార్కెట్‌లో పతనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరో వైపు ఎకరాకు 25 క్వింటాళ్లు వరకూ ఎండు పసుపు కొమ్ముల దిగుబడి వస్తున్న విషయం తెలిసిందే. క్వింటా ధర రూ.11,500 వరకూ పలుకుతోంది. వానల వల్ల కొమ్ములు నలుపు వచ్చినా, నాణ్యత దెబ్బతిన్నా ధర తగ్గుతుందనే ఆందోళన రైతులను కలవరపెడుతోంది.
అకాల వర్షాలకు తీవ్ర నష్టం
1.5 ఎకరాల్లో మొక్కజొన్న, 70 సెంట్లలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న పూర్తిగా పడిపోయింది. చేలోనే పంట ఉండిపోయింది. ఎంత వస్తుందో దిగుబడి, ఎంత ధర వస్తుందో కూడా తెలియదు. పసుపు పంట ఎండబెట్టి మార్కెట్‌కు పంపుదామని చూస్తూంటే రోజూ వర్షమే. తడవటం, ఆరబెట్టడం ఇదే పనిగా మారింది. ఈ ఖర్చులే ఇప్పటి వరకూ రూ.10 వేలు అయ్యాయి. ఈ సీజన్‌లో వానల వల్ల పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు.
– చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు
అధికారులకు పట్టడంలేదు
ఎకరంన్నరలో మొక్కజొన్న, ఎకరంన్నరలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న చేను పడిపోయి నష్టం జరిగిందని అధికారుల వద్దకు వెళ్లాను. పంట తీసుకొచ్చి చూపండని చెప్పారే కానీ వారు వచ్చి చేను చూడటం, నమోదు చేయటం జరగలేదు. ఇంకా మా బాధలు ఏం చెప్పాలి? తరచూ కురుస్తున్న వానలకు పసుపు పంట తడుస్తోంది. కటిక వచ్చి నాణ్యత దెబ్బతింటే మార్కెట్‌లో ధర పడిపోయే ప్రమాదం ఉందని భయంగా ఉంది.
– నూతక్కి ధనకోటేశ్వరరావు, కౌలురైతు, గొడవర్రు
కన్నెత్తి చూడని అధికారులు
అటు వ్యవసాయశాఖ, ఇటు ఉద్యాన శాఖ అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పొలంలోనే నేలవాలిన, పంటకు నష్టం జరిగినా కనీసం తమ పొలాలకు వచ్చి చూసి పంట నష్టం నమోదు చేసిన అధికారులు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టం నమోదు ప్రాథమిక అంచనాల్లో సైతం ఒక ఎకరం విస్తీర్ణంలోనూ పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ చూపకపోవటం విడ్డూరం. పసుపు పంట చేతికొచ్చాక వర్షాలకు తడిచి దెబ్బతిందని, ఈ దశలోనూ నష్టం నమోదు చేస్తే తమకు ఊరటగా ఉంటుందని రైతులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను అకాల వర్షాలు విడవటం లేదు. రబీ సీజన్‌లో వరి, పసుపు, మొక్కజొన్న, మినుము ఇతర పంటలు చేతికొచ్చింది మొదలు అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆ శాఖ అంచనా మేరకు కృష్ణా జిల్లాలో 54 హెక్టార్లలో పంట దెబ్బతింది. వీటిలో ప్రధానంగా అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల పంటలు ఉన్నాయి. తాజాగా ద్రోణి ప్రభావంతో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అతి కష్టం మీద ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కేలు, బయటి వ్యాపారుల ద్వారా మిల్లులకు తరలించి రైతులు సొమ్ము చేసుకోగలిగారు.

రైతులకు అకాల కష్టం

రైతులకు అకాల కష్టం