
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో విశాఖ ఉక్కు రక్షణకు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు బుధవారం ధర్నా చేశాయి. బీజేపీ డౌన్ డౌన్.. విశాఖ ఉక్కును కాపాడుకుందాం అంటూ ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర దర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రసంగించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రయత్నాలను కొనసాగిస్తోందన్నారు. ఇందులో భాగంగానే దఫదఫాలుగా వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిందన్నారు. పర్మనెంటు కార్మికులు 1400 మందిని తగ్గిస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి కార్మికులకు సగం జీతాలే చెల్లిస్తోందని వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లే ప్రకటించి బ్యాంకుల బకాయిల రూపంలో తిరిగి జమ చేసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులు, ప్రజలు పోరాడుతుంటే వారిని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందన్నారు. కార్మి కుల తొలగింపు చర్యలు మానుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ.వి.నాగేశ్వరరావు, కె.దుర్గారావు, ఎన్.సీహెచ్.శ్రీనివాసరావు, మూలి సాంబశివ రావు, డి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.