
యోగాంధ్ర మాసోత్సవాలు ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. భారతీయ వారసత్వ, ప్రాచీన సంపదను అందరికీ అందించాలన్నదే యోగాంధ్ర ఉద్దేశమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన బుధవారం విజయవాడ భవానీపురంలోని పున్నమిఘాట్‌లో యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. యోగా ట్రైనర్ రామాంజనేయులు యోగా ప్రయోజనాలతోపాటు పతంజలి యోగా సూత్రాలను వివరిస్తూ ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ యోగా నిపుణులు రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్ ఆధారంగా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తా మని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లా డుతూ.. నెల రోజుల యోగాంధ్రలో భాగంగా గ్రామ/వార్డ్ సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. యోగా విశిష్టతపై రాష్ట్రం నలుమూలల యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, మునిసిపల్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు.