వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

May 22 2025 12:33 AM | Updated on May 22 2025 12:33 AM

వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

పటమట(విజయవాడతూర్పు): అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం దైవ సేవతో సమానమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రభుత్వాస్పత్రిని అగ్రస్థానంలో నిలపాలని, టీమ్‌ జీజీహెచ్‌ స్ఫూర్తితో పనిచేయా లని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయా లన్నారు. ఇటీవల ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై ప్రభుత్వం సేకరించిన ప్రజాభిప్రాయ నివేదిక ప్రకారం విజయవాడ సర్వజనాస్పత్రికి ఇచ్చిన నివేదికలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యం, అవినీతి రహిత సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆదర్శవంతమైన ఆస్పత్రిగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషిచేయా లని సూచించారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ వెంకటేష్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ మంగాదేవి, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ నాగార్జున, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

ఆమోదం పొందిన అంశాలు ఇవీ..

పల్మనరీ మెడిసిన్‌ డిపార్టుమెంటుకు రూ.5.17 లక్షలు, గైనకాలజీ డిపార్టుమెంటుకు రూ.4.50 లక్షలు, మైక్రోబయాలజీ డిపార్టుమెంటుకు రూ.10.90 లక్షలు, ఈఎన్‌టీ డిపార్టుమెంటుకు రూ.3 లక్షలు, డీవీఎల్‌ డిపార్టుమెంటుకు రూ.2.82 లక్షలు, ఎమర్జెన్సీ మెడిసిన్‌ డిపార్టుమెంటుకు రూ.3.74 లక్షలతో వివిధ సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. పాత, కొత్త జీజీహెచ్‌లతో పాటు పీఎంఎస్‌ఎస్‌వై బ్లాక్‌లో రూ.4.50 లక్షలతో పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. ఓపీ కౌంటర్ల క్యూబికల్స్‌ కోసం రూ.లక్షతో పనులు చేపట్టేందుకు, ఆర్థోపెడిక్‌ డిపార్టుమెంట్‌లో దాదాపు రూ.3 లక్షలతో అవసరమైన సౌకర్యాల కల్పనకు కూడా ఆమోదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement