
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
● బీడీసీ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు వర్షాలతో ఆటంకం ● పనుల కోసం జరిగిన తవ్వకాలతో ప్రమాదకరంగా బీడీసీ ఎడమ కట్ట ● కొద్దిపాటి వర్షం పడినా వరదంతా విజయవాడ వైపు తరలే ప్రమాదం
జి.కొండూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలో జల ప్రళయానికి కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వేసవి చివరిలో గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అడుగడుగునా బ్రేక్‌లు పడి పనులు ముందుకు సాగడంలేదు. ఈ పనుల కోసం జరిగిన తవ్వకాలతో డైవర్షన్ కెనాల్ కట్ట ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భారీ వర్షం పడితే మైలవరం నియోజకవర్గంలో కురిసిన ప్రతి వర్షపు బొట్టు విజయవాడ వైపు తరలిపోయి మరో జల ప్రళయం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వరద నివారణ చర్యల్లో ప్రభుత్వ పని తీరును చూసి ఇదేనా విజన్ బాబూ అంటూ స్థానికులు విస్తుపోతున్నారు.
ఎనిమిది నెలలుగా కాలయాపన
గతేడాది ఆగస్టు 30వ తేదీ రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరద పోటెత్తి జల ప్రళయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ ప్రళయానికి కారణం కూడా ప్రభుత్వ నిరక్ష్యమే కారణమని అప్పట్లో విమర్శలు తలెత్తాయి. ఈ వరదలకు ప్రధాన కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లను అప్పట్లో మిలటరీ సాయంతో ప్రభుత్వం తాత్కాలికంగా పూడ్చింది. అయితే ఈ గండ్ల వద్ద కాంక్రీటు వాల్ నిర్మించకపోతే మరో సారి గండ్లు పడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ నిపుణులు తేల్చారు. అయినప్పటికీ కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం నిధులను కేటాయించ డంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. గండ్లు పడిన ఆరు నెలల తర్వాత మార్చి 21న హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.1.80 కోట్లు, డైవర్షన్ కెనాల్‌కు గండ్లు పడిన ప్రదేశంలో ఎడమ వైపు 500 మీటర్లు, కుడి వైపు 50 మీటర్ల కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం రూ.37.97 కోట్ల కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ.28 కోట్లతో గోడ నిర్మాణ పనుల కోసం 54 రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ పనులు నిరంతరాయంగా కొనసాగితే మూడు నెలల్లో కాంక్రీట్ గోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో వచ్చేది కూడా వర్షా కాలం కావడంతో పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడంలేదు.
వర్షంతో పనులకు బ్రేక్
బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు జి.కొండూరు మండల పరిధి కవులూరు, కొండపల్లి శాంతినగర్‌కు సమీపంలో కట్టకు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణం కోసం కట్టను తవ్వి పనులు ప్రారంభించారు. ఎగువ నుంచి నీరు దిగు వకు రాకుండా ఈ ప్రదేశంలో కెనాల్‌కు అడ్డంగా ఆనకట్ట కట్టారు. అయితే రెండు రోజులుగా భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు ప్రారంభంలోనే బ్రేక్ పడింది. కాలువ కట్ట బురదమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పనులు ముందుకు సాగడంలేదు. కెనాల్ ఎగువున నిల్వ ఉన్న నీటి నుంచి ఊట వస్తుండటంతో ట్రాక్టరు ఇంజిన్లతో నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. మరో వైపు నైరుతి రుతుపవనాలు కూడా మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉండడంతో ఇప్పటికే కృష్ణాజిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టడం లేదా కట్టను తవ్విన ప్రదేశంలో గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
గండ్లు పడిన తర్వాత ఎనిమిది నెలలుగా కాలయాపన చేసిన ప్రభుత్వం, వర్షాకాలం ఆరంభానికి ముందు పనులను ప్రారంభించింది. ప్రస్తుత అకాల వర్షాలతో పనులకు బ్రేక్ పడుతోంది. కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కట్టను తవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న సైపన్ ఎత్తు పెంచేందుకు కట్టను కింద వరకు తవ్వారు. దీంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఎగువ బుడమేరుకు పడిన గండ్లు, మైలవరం నియోజకవర్గంలో చెరువులకు పడిన గండ్లను కూడా ఇప్పటి వరకు పూడ్చకపోవడంతో ఒక వేళ రాత్రి సమయంలో భారీ వర్షం కురిస్తే వరదంతా నేరుగా విజయవాడ వైపు తరలిపోయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే ప్రమాదం ఉంది.
వర్షంతో పనులకు ఆటంకం
బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులకు వర్షం అడ్డంకిగా మారింది. రోజూ వర్షం పడడం వల్ల పనులు ముందుకు సాగడంలేదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటే పనులను ప్రారంభించి చకచకా చేయిస్తున్నాం. పనులు జరుగుతున్న ప్రాంతంలో కట్ట బలంగానే ఉంది. వరద ప్రవాహం వల్ల గండ్లు పడే అవకాశం ఉండదు.
– పి.కౌశిక్,
పోలవరం కాలువ ఏఈఈ, వెలగలేరు

ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం

ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం