
గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడరూరల్: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల వేధింపులతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘ధరలకు చెల్లిన నూకలు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆదివారం నున్నలో పోలవరం కాల్వ రోడ్డుపై రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాసులను పరిశీలించారు. వాతావరణ హెచ్చరికలతో పరదాలతో కప్పి ఉంచిన ధాన్యం రాసుల వద్ద ఉన్న రైతులను కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పలకరించారు. ధాన్యం పూర్తిగా ఆరిపోయినా తేమ ఉందని సీరియల్ ప్రకారం కొనుగోలు చేస్తామని సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు రైతులు ఆయనకు చెప్పారు. భీమవరపు మల్లికార్జునరెడ్డి అనే రైతు ధాన్యం రాసిని పరిశీలించిన కలెక్టర్ తేమశాతం కొలిచే మిషన్ పట్టుకు రావాలని చెప్పారు. తేమశాతం కొలిచే మిషన్ లేకపోవడంతో రైతులను సీరియల్ అంటూ ఇబ్బంది పెట్టడం ఏంటని టెక్నికల్ అసిస్టెంట్ రాహుల్‌పై కలెక్టర్ మండి పడ్డారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
రైతులను ఇబ్బంది పెడుతున్న సిబ్బందిపై యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ముత్యాల శ్రీనివాస్‌ను ఉద్దేశించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. పి.నైనవరం మిల్లర్ వద్ద కొను గోలులో ఇబ్బంది పెడుతున్నారని రైతులు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి కలెక్టర్ లక్ష్మీశకు తెలిపారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో దాళ్వా సీజన్‌లో వరిపంట 1.60 లక్షల టన్నుల దిగుబడులున్నాయన్నారు. జిల్లాలో 107 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రూ.6 కోట్లను చెల్లించామని చెప్పారు. రైస్‌మిల్లుల వద్ద తహసీల్దార్ స్థాయి అధికారులను ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.
రైతులతో ఆర్డీఓ సమావేశం
జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల వేధింపులతో రైతులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన ‘ధరకు చెల్లిన నూకలు’ కథనానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కలెక్టర్ లక్ష్మీశ నున్న ప్రాంతంలో ధాన్యం నిల్వలను పరిశీలించగా, ఆర్డీఓ కావూరి చైతన్య జి.కొండూరు మండల పరిధి కవులూరు గ్రామంలో ధాన్యం రైతులతో సమావేశమయ్యారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి మద్దతు ధరకే రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కుంటముక్కల గ్రామ శివారులోని రైస్ మిల్లును తనిఖీ చేశారు. వాతావరణ మార్పులతో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించడంతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు

గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు