అనుమానితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

అనుమానితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

Apr 10 2025 12:41 AM | Updated on Apr 10 2025 12:41 AM

అనుమా

అనుమానితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

పెనమలూరు: యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ ఫిరోజ్‌ విజ్ఞప్తిచేశారు. ఆయన బుధవారం వివరాలు తెలుపుతూ కృష్ణానదిలో ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని మహిళ హత్యకు గురైందని, ఈ హత్య ఇద్దరు వ్యక్తులు చేసి ఉంటారని సీసీ ఫుటేజీ కదలికల ద్వారా తెలుస్తోందని వివరించారు. ఒక వ్యక్తి తొలుత కరకట్ట దిగువన ఉన్న బార్‌లో మద్యం సీసా కొనుగోలు చేశాడని, ఆ తరువాత అతను మరో మహిళతో కలిసి మృతురాలిని కృష్ణానదిలోకి తీసుకువెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. అక్కడ మహిళ హత్య జరిగిన తరువాత నిందితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారన్నారు. ఫొటోలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

కరకట్టపై లారీకి తప్పిన ముప్పు

తోట్లవల్లూరు: తోట్లవల్లూరులోని కృష్ణా కరకట్ట వద్ద బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. స్థానిక కృష్ణానది రేవు నుంచి ఓ లారీ కరకట్ట పైకి ఎక్కే క్రమంలో పొరపాటుగా హైడ్రాలిక్‌ పైకి లేచి, ఫైబర్‌నెట్‌ తీగకు పట్టి బలంగా లాగేయటంతో పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్‌లైన్‌ ఉన్న విద్యుత్‌ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే విద్యుత్‌ స్తంభం కూలే క్రమంలో ఒక్కసారిగా గంగూరు సబ్‌స్టేషన్లో ట్రిప్‌ అవటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనలో డ్రైవర్‌ నాగనాంచారయ్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ట్రాన్స్‌కో ఏఈఈ దేవదాసు ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన సిబ్బందిని ఏర్పాటు చేసి దెబ్బతిన్న స్తంభం తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

తిరువూరు: వత్సవాయి పోలీసుస్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్‌ చిల్లపల్లి శ్రీని వాసరావు(42) బుధవారం సాయంత్రం గంపలగూడెం మండలం తోట మూలలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంపలగూడెం పోలీసుల కథనం మేరకు.. శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2011లో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు ఎ.కొండూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తూ వత్సవాయికి బదిలీ అయ్యాడు. పది నెలలుగా విధులకు కూడా వెళ్లకుండా మానసిక వత్తిడికి గురవుతున్నాడు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు. శ్రీనివాసరావు మృతదేహానికి తిరువూరు పోలీసు స్టేషన్లో పోస్టుమార్టం నిర్వహించారు.

అనుమానితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి  1
1/1

అనుమానితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement