
సగటు వేతనం రూ.307 వచ్చేలా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో వేతనదారులకు పని కల్పించడంలోనూ, సగటు దినసరి వేతనం రూ.307 వచ్చేలా చూడటంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆ యన డ్వామా అధికారులతో కలిసి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులతో పాటు సగటు రోజువారీ వేతనాలు, గ్రామాల వారీగా వేతనదారుల హాజరు, వారికి అందుతున్న వేతనం తదితరాల్లో పురోగతిని సమీక్షించారు. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 80 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది గణాంకాల ఆధా రంగా ఈ ఏడాది మండలాలు, రోజుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. ఈ ఏ డాది మార్చి నుంచి జూన్ వరకు 2,737 పంట కుంటల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, 69 కుంటల నిర్మాణం 100శాతం పూర్తయిందని, మరో 1,029 పంట కుంటలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వేసవిలో పశువులతో పాటు గొర్రెలు, మేకలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామని, పశు సంవర్థక శాఖ 277 తొట్టెల పనుల ను గుర్తించి, పనులు చేపట్టిందన్నారు. మిగిలిన వా టికి సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రక్రియ ఈ నెల 12 నాటికి పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటల సాగుకు 2025–26లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 20 ఎకరా లను గుర్తించాలని, జిల్లా లక్ష్యం 4వేలఎకరాలుగా ఉం దని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.సమావేశంలో డ్వా మా పీడీ ఎ.రాము, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ఈ ఏడాది 80 లక్షల ఉపాధి హామీ పనిదినాలు లక్ష్యం
పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో
నెరవేరేలా పనిచేయాలి