
బూజు పట్టి.. తుప్పు కంపుకొట్టి
కంకిపాడు: బూజు పట్టి.. తప్పు కంపు కొడుతున్న టేక్ హోం రేషన్ గర్భిణులు, బాలింతలకు అందుతోంది. గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాలను సమకూర్చడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న టేక్ హోం రేషన్ కిట్లు నాసిరకంగా ఉన్నాయి. ఈ కిట్లు వినియోగిస్తే పోషకాలు మాటేమో కానీ, ఆస్పత్రి పాలవడం మాత్రం ఖాయమని పలువురు తల్లులు వాపోతున్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా నాసిరకం పౌష్టికాహారం కిట్లు సరఫరా అవుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో..
కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కంకిపాడు మండలంలో 62 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 520 మంది వరకూ గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరికి ప్రతినెలా టేక్ హోం రేషన్ కిట్ పేరుతో 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, 250 గ్రాముల ఎండు కర్జూరం, 200 గ్రాములు పల్లీ చిక్కీలు, 3 కిలోలు బియ్యం, 250 గ్రాములు బెల్లం, కిలో అటుకులు, 2 కిలోలు రాగిపిండి, అరలీటరు పామాయిల్, కిలో కందిపప్పు సరఫరా చేస్తున్నారు.
కర్జూర ప్యాకెట్లు తెరిస్తే వాసన..
టేక్ హోం రేషన్ కిట్ గత నెల 25న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యింది. నెల ఆరంభంలో రావాల్సిన కిట్ నెలాఖరుకు రావటంతో వీటిని ఆయా కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సిబ్బంది హడావిడిగా పంపిణీ చేసేశారు. ఈ కిట్‌లోని ఎండు కర్జూరం బూజుపట్టి పాడైన కాయలు వచ్చాయి. ఒక్క పాక్యెట్‌లో కనీసం ఐదు కాయలు పైగా పాడై ప్యాకెట్ తెరవగానే దుర్గంధం వచ్చిన పరిస్థితి. బెల్లం తుప్పు కంపుకొడుతోందని సమాచారం. రాగిపిండి జల్లెడ పడితే పొట్టుతో కూడిన వ్యర్థాలు వస్తున్నాయని చెబుతున్నారు. కంకిపాడు పట్టణంలోని ఓ వార్డులో తనకు వచ్చిన కిట్‌లో సామాగ్రి నాణ్యత లేకపోవడంపై ఓ మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ కిట్‌ను తీసుకుని మరో కిట్‌ను అందించినట్లు అధికారులు చెప్పడం నాసిరకంగా కిట్లు వస్తున్నాయన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.
పర్యవేక్షణ సున్నా..
కిట్‌ల సరఫరా, పంపిణీ విధానంపై ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కిట్లు అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుకోగానే కనీసం ఏదో ఒక కేంద్రాన్ని అధికారులు సందర్శించి కిట్ల నాణ్యత పరిశీలించడం, పంపిణీని పర్యవేక్షించడంలో లోపం కారణంగా నాసిరకంగా కిట్లు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఫలితంగా గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు ఏ మేరకు చర్యలు చేపడతారో వేచిచూడాల్సి ఉంది.
మూడు నెలలుగా బెల్లం అధ్వానం
నాణ్యత లేని రాగిపిండి
నాసిరకం బెల్లం, ఎండు కర్జూరం
గర్భిణులు, బాలింతలకు అందుతున్న టేక్‌హోం రేషన్
ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ శూన్యం
బెల్లం సరఫరా మూడు నెలలుగా అధ్వానంగా ఉంటోందని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పావు కిలో బెల్లం అచ్చు లబ్ధిదారులకు సరఫరా జరిగింది. కూటమి పాలనలో ఈ మూడు నెలల్లో టేక్ హోం రేషన్ కిట్లు నాణ్యత పూర్తిగా దెబ్బతిందని తెలుస్తోంది. మూడు నెలలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న బెల్లం ప్యాకెట్‌లను సరఫరా చేస్తున్నారని, అది కూడా తినే పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాడైతే తిరిగి ఇచ్చేయండి..
నెలాఖరుకు కిట్లు రావటం, వరుసగా సెలవులతో కిట్లు డ్యామేజ్ అయ్యాయి. రేషన్ కిట్లు తీసుకునే లబ్ధిదారులు చెక్ చేసుకుని, పాడైతే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు. కంకిపాడులో ఓ మహిళ ఫోన్ చేస్తే విచారణ చేసి కిట్‌ను మార్చి ఇచ్చాం. ఎవరి వద్ద పాడైన కిట్లు ఉన్నాయో కేంద్రానికి తీసుకురావాలని సూచించాం. ఉన్నతాధికారుల దృష్టిలో సమస్య ఉంచాం. నెలాఖరుకు కిట్లు రావడంతో హడావిడి అయ్యింది.
– కె.బి. సుకన్య, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు, కంకిపాడు

బూజు పట్టి.. తుప్పు కంపుకొట్టి