
గత ఏడాది అమ్మఒడి నగదు పడిన మెసేజ్ చూపుతున్న విద్యార్థుల తల్లి (ఫైల్)
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకానికి అధికారులు ముమ్మర కసరత్తు చేపట్టారు. విద్యారంగంలో అపూర్వమైన సంస్కరణలను చేపట్టి విద్యార్థులను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారు. అందులో భాగంగా అమ్మఒడి పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులు పాఠశాలలకు దూరం కాకుండా ఉండేలా ఆదుకుంటున్నారు. ఈ పథకాన్ని నాలుగో విడత సైతం సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అందులో భాగంగా విద్యాశాఖతో పాటుగా సచివాలయ వ్యవస్థ ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు ప్రారంభించాయి. 2023 – 2024 విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి వారంలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులను తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గత ఏడాది రూ.469 కోట్లు మంజూరు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో గత ఏడాది సుమారు రూ.469 కోట్లు జమ చేశారు. కృష్ణా జిల్లాలో 1,35,434 మంది విద్యార్థులకు సంబంధించి రూ.203 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 1,80,254 మంది విద్యార్థులకు సంబంధించి రూ.266 కోట్లు మంజూరు చేశారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతు న్నారు. రెండు జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఈ ఏడాది సుమారు రూ.500 కోట్ల వరకూ జమచేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
అర్హులందరికీ అమ్మ ఒడి
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అర్హులు అందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేసి, విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌లో ఉన్న జాబితా మేరకు లబ్ధిదారుల బయోమెట్రిక్ ద్వారా సచివాలయ విద్య కార్యదర్శి అథెంటిఫికేషన్ చేయనున్నారు. జాబితా పరిశీలన చేసి అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదా అనేది ధ్రువీకరించనున్నారు. ఆధార్ కార్డు వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు అనుసంధానమై ఉంటే, సాంకేతిక సమస్యలు తలెత్తి గత ఏడాది కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి సమస్యలనను ఈ సారి సచివాలయ స్థాయిలో పరిష్కరించాలని అధికారులు నిర్ణ యించి, ఆ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలి సింది. తుది జాబితా రూపకల్పన చేసి త్వరలో అందుబాటులో ఉంచే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
త్వరలో సచివాలయాల్లో అందుబాటులో అర్హుల జాబితాలు అర్హులందరికీ మంజూరు చేసే దిశగా చర్యలు గత ఏడాది ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.469 కోట్లు మంజూరు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
సచివాలయాల్లో కసరత్తు
ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన చైల్డ్ ఇన్ఫోతో అనుసంధానమై ఉన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాలను త్వరలో ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ జాబితాలను తల్లిదండ్రులు పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో సైతం జాబితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమకానుంది. ఈ విషయంపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు సచివాలయ విద్య కార్యద ర్శులకు, గ్రామ/వార్డు వలంటీర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు.