వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 సర్వీసెస్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి విజయవాడ నగరంలోనే రెండు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 1,307 మంది అభ్యర్థులు ఈ నెల మూడు నుంచి పదో తేదీ వరకూ జరిగే పరీక్షలకు హాజరవుతారు. ఏడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులను ఉదయం 9.00 గంటలకు లోపలకు అనుమతిస్తారు. 9.45 నిమిషాల వరకూ అనుమతించి తలుపులను మూసివేస్తారు. నగరంలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల (కేబీఎన్ కళాశాల), పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలను పరీక్ష కేంద్రలుగా నిర్ణయించారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటుగా ఏదో ఒక గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సారి మొదటి సారిగా బయోమెట్రిక్ హాజరును తీసుకోనున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల రెండు నుంచి పదో తేదీ వరకూ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.