పీక పట్టుకుంది!

కంకిపాడు మండలం ఈడుపుగల్లులో సాగులో ఉన్న చెరకు మొక్క తోట   - Sakshi

చెరకు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్న పురుగు

మారిన వాతావరణ పరిస్థితుల్లో పురుగు ఉద్ధృతి

సకాలంలో యాజమాన్య చర్యలు చేపడితే నష్ట నివారణ

కంకిపాడు(పెనమలూరు): చెరకు పంటను పీక పురుగు పట్టి పీడిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పురుగు ఉద్ధృతి కూడా క్రమేపీ పెరుగుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో పురుగు ఉద్ధృతిని గుర్తించి యాజమాన్య చర్యలు తీసుకుంటే పంట నష్టాన్ని అధిగమించొచ్చని ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.

జిల్లాలో ఇది పరిస్థితి..
వాణిజ్య పంటల్లో చెరకు పంట కూడా ఒకటి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో పిలక తోటలు, 7,500 ఎకరాల్లో మొక్క తోటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల పీక పురుగు ఉద్ధృతిని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులతో కలిసి శాస్త్రవేత్తల బృందం పర్యటించి పురుగు కదలికలను గుర్తించింది. చెరకు నాటిన రోజు నుంచి 120 రోజుల పంట కాలం వరకూ పీక పురుగు ఆశిస్తుంది. ప్రధానంగా లేత చెరకు పంటలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పురుగు ఉద్ధృతి కూడా మధ్యస్త స్థాయి నుంచి అధికంగా ఉండటాన్ని గమనించారు. దీనినే మొవ్వు పురుగు అని కూడా పిలుస్తారు.

ఉద్ధృతంగా పంటపై దాడి..
చెరకు పంటను పీక పురుగు తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆశించి ఉద్ధృతంగా దాడి చేసి పంటకు నష్టం కలిగిస్తున్నాయి. మొవ్వులోకి ప్రవేశించి తొలుచుకుంటూ దవ్వ మధ్యలో ఉన్న కణజాలాన్ని తినేయటంతో ఎదుగుదల క్షీణించి మొక్కలు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం, ఆలస్యంగా నాటిడం కార్శి తోటల్లో పీక పురుగు అధికంగా ఆశించటానికి కారణాలు. దీంతో పాటు వేసవిలో నీటిఎద్దడి ఎక్కువగా ఉండటం మరో కారణం

పిల్ల పురుగు ఇలా చేయటం మేలు..

చెరకు ముచ్చులను లోతైనకాల్వలో (బోదెలో) నాటుకోవాలి.

వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి.

చెరకు చెత్తను 1.25 టన్నుల చొప్పున మొక్క తోటలలో నాటిన మూడో రోజు, కార్శి తోటల్లో చెరకు నరికిన వెంటనే చెరకు మొదళ్లను కప్పాలి.

లింగాకర్షక బుట్టలు ఎకరాకు నాలుగు చొప్పున 30 రోజుల నుంచి 120 రోజుల వరకూ అమర్చి పురుగు ఉనికిని గుర్తించాలి.

లింగాకర్షక బుట్టలు పురుగు రెక్కల పురుగుదశలో ఉన్నప్పుడే అమర్చాలి.

ట్రైకోగ్రామ ఖిలోనిస్‌ గుడ్ల పరాన్నజీవి (50,000/హెక్టార్‌కు) నాటిన 30 రోజుల నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు విడుదల చేయాలి.

అప్రమత్తతతో నష్ట నివారణ..
చెరకు నాటే ముందు బోదెల్లో కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలు 15 కిలోలు లేదా, క్లోరాంట్రినిలిప్రోల్‌ 0.4జీ 9కిలోలు, లేక ప్రిఫొనిల్‌ 0.3జి 10 కిలోలు 1:2 నిష్పత్తి ఇసుకతో కలిపి వేసుకోవాలి. పురుగు ఉద్ధృతి మధ్యస్తంగా ఉంటే క్లోరిఫైరిపాస్‌ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్‌ 1.0గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి నాటిన నాలుగు నుంచి ఆరు, తొమ్మిది వారాల్లో పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉద్ధృతి గుర్తించి యాంత్రిక పద్ధతిలో లింగాకర్షక బుట్టలను, జీవ నియంత్రణ పద్ధతిలో పరాన్నజీవులను విడుదల చేయటం ద్వారా కూడా పంటను కాపాడుకోవచ్చు. అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని అధిగమించటం సులువు.
– డాక్టర్‌ డి.సుధారాణి, సీనియర్‌ శాస్త్రవేత్త, సస్యరక్షణ విభాగం, చెరకు పరిశోధనాస్థానం, ఉయ్యూరు

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top