
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆర్.కె.రోజా
క్రీడా శాఖ మంత్రి ఆర్‌కే రోజా
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) గురువారం సమావేశమైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని టేబుల్ టెన్నిస్ హాలులో జరిగిన ఈ సమావేశానికి మంత్రి రోజాతో క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి, ఎండీ కె.హర్షవర్థన్ హాజరయ్యారు. ముందుగా క్రీడా సంఘాల ప్రతినిధుల నుంచి పలు సలహాలు, సూచనలు, విన్నపాలు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ గతంలో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఇకపై డైరెక్ట్ రిజర్వేషన్ పద్ధతిని ప్రభుత్వం అమలు చేయబోతుందన్నారు. దీనిలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఈబీసీ, విభిన్న ప్రతిభావంతులను చేర్చినట్లు చెప్పారు. త్వరలో దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయబోతుందన్నారు. జీవో 74 ప్రకారం మరో 24 క్రీడలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తామన్నారు. స్పోర్ట్స్ పాలసీని త్వరలో అమలు చేస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులను ప్రాధాన్యతాక్రమంలో సమకూర్చుతామన్నారు. అదేవిధంగా క్రీడా సంఘాలు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
క్రీడా సంఘాలు ఏకతాటిపైకి రావాలి..
క్రీడా సంఘాల్లో వివాదాల కారణంగానే రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. దీని కారణంగానే ప్రతిభ ఉన్న క్రీడాకారులు ప్రభుత్వ పారితోషకాలను, విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలను అందుకోలేకపోతున్నారు. కబడ్డీ సంఘంలో వివాదంతో కబడ్డీ క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. సంఘాల ప్రతినిధులు పంతాలకు పోయి క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఇటీవల ఫుట్‌బాల్ సంఘంలోనూ ఇదే తరహాలో వివాదం చెలరేగిందన్నారు. మే నెలలో జరిగే ఫుట్‌బాల్ సంఘ ఎన్నికలను సిట్టింగ్ జడ్జి సమక్షంలో నిర్వహిస్తామన్నారు.