కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

- - Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాశారు. కృష్ణా జిల్లాలో మొత్తం 18,418 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 18,125 మంది హాజరయ్యారు. 293 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 35,995 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 35,363 మంది విద్యార్థులు హాజరయ్యారు. 632 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలోని కృష్ణలంక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, చిట్టినగర్‌ సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల, వన్‌టౌన్‌లోని కేబీఎన్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆర్‌ఐవో పి. రవికుమార్‌ పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ జరగలేదని ఆయన తెలిపారు.

31 నుంచి యువజనోత్సవాలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జాతీయ స్థాయి సాంస్కృతిక యువజనోత్సవాలను ఈ నెల 31వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు అన్నారు. కేఎల్‌ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను గురువారం కలెక్టర్‌ ఢిల్లీరావు ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాక్‌ పార్లమెంట్‌, క్విజ్‌, వివిధ విభాగాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, గేమింగ్‌ పోటీలను నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు. ప్రచార పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో కేఎల్‌ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు డమరకనాథ్‌ వెంకట్‌, సురేష్‌, గణేష్‌, హర్ష, బాలాజీ తదితరులు ఉన్నారు.

నిత్యాన్నదానానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు గురువారం విరాళాలను అందజేశారు. తిరువూరు గుడిమెట్ల లక్ష్మీరవీంద్రబాబు కుటుంబం గుడిమెట్ల రాఘవరావు, వజ్రమ్మల పేరిట రూ. 1,01,116, విజయవాడ భవానీపురానికి చెందిన ఐ. పూర్ణచంద్రరావు కుటుంబం రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు బహూకరించారు.

28 నుంచి ‘అమ్మ’

శత జయంతి ఉత్సవాలు

విజయవాడ కల్చరల్‌: బాపట్ల జిల్లా జిల్లెళ్లమూడి అమ్మ శత జయంతి ఉత్సవాలను ఈనెల 28 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు విశ్వజననీ పరిషత్‌ మేనేజింగ్‌ ట్రస్టీ పి. గిరిధర్‌కుమార్‌ తెలిపారు. విజయవాడలోని కౌతా పూర్ణానందం విలాస్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ అమ్మ శాంతి సందేశం సమస్త మానవాళికి వినిపించడానికి ట్రస్ట్‌ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదురోజులపాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి ప్రారంభించి, శతజయంతి విశిష్ట సంచిక ఆవిష్కరిస్తారన్నారు. ప్రచార కమిటీ కార్యదర్శి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి మాట్లాడుతూ సిద్ధేశ్వరానంద భారతి, విశ్వయోగి విశ్వంజీ, కమలానంద భారతి, సీతారామ గురుదేవులు, వాసుదేవానంద గిరి స్వామీజీల అనుగ్రహ భాషణ ఉంటుందన్నారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు.

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top