ఆంధ్రా షిర్డీ.. అద్భుతః

కోటి రుద్రాక్ష అభిషేకానికి సిద్ధం చేసిన రుద్రాక్ష మాలలు - Sakshi

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): సర్వమానవాళి సంక్షేమం కోసం ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో ఈనెల 28వ తేదీన కోటి రుద్రాక్ష అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి పర్యవేక్షణలో ఏటా లోక కళ్యాణార్థం విశేషంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడా నిర్వహించని విధంగా 2018లో లక్ష నారికేళ జలాలతో అభిషేకం చేశారు. ఇందుకుగానూ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చోటు లభించింది. అలాగే 2021లో దశ సహస్ర వస్త్ర పూజ, 2022లో లక్ష కేజీల బియ్యంతో తండులాభిషేకం జరిపారు. తండులాభిషేకానికి సైతం వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వచ్చింది. ఇప్పుడు నేపాల్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కోటి రుద్రాక్షలతో ఈనెల 28వ తేదీన బాబాకు విశేషంగా అభిషేకం చేయటానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి కోటి రుద్రాక్షలను దర్శించారు.

10 నెలలుగా రుద్రాక్షలు సేకరణ..

గత 10 నెలల నుంచి నేపాల్‌లో మందిర సేవకులు పర్యటించి చెట్ల నుంచి రాలిపడిన రుద్రాక్షలను సేకరించి నగరానికి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన రుద్రాక్షలను శుభ్రం చేసి గ్రేడింగ్‌ చేశారు. వాటిని మాలలు తయారు చేశారు. 108 రుద్రాక్షలను తీగతో కలిపి ఓ మాలగా రూపొందించారు. రుద్రా క్షలకు చతుర్వేదానుసారం విశేషంగా అభిషేకం చేసి భక్తుల చేతులమీదుగా బాబా మెడలో వేయిస్తారు.

కోటి రుద్రాక్ష అభిషేకానికి ముస్తాబైన ముత్యాలంపాడు బాబా మందిరం ఈ నెల 28న కార్యక్రమ నిర్వహణ లోక కల్యాణార్థం ఏటా విశేష పూజలు ఇప్పటికే రెండు సార్లు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

రెండు లక్షల మందికి భోజన ఏర్పాట్లు ..

ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని మందిరంలో కోటి రుద్రాక్ష అభిషేకానికి ఏర్పాటు చేశాం. ఇప్పటికే రాష్ట్రంలోని యతీశ్వరులు, ప్రముఖులకు ఆహ్వానాలు పంపించాం. కోటి రుద్రాక్ష అభిషేకానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సుమారు రెండు లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు దాతల సహకారంతో ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరాన్ని ఆంధ్రాషిర్డీగా తీర్చిదిద్దాం.

– డా. పూనూరు గౌతంరెడ్డి,

మందిర గౌరవాధ్యక్షుడు

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top