
కంటిచూపుపై ప్రభావం..
ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలను వినియోగిస్తే కంటిచూపుపై ప్రభావం పడుతుంది. దీని వలన రెటీనా పొర దెబ్బతింటుంది. కంటిచూపు మందగించటంతో పాటు ఎముకల సమస్యలు వస్తాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. సెల్‌ఫోన్ అతి వినియోగం మంచిది కాదు.
– కె. మధురిమ, వైద్యురాలు,
పీహెచ్‌సీ, కంచికచర్ల
సమయం వృథా చేయవద్దు..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో సామాజిక మాధ్యమాలకు అలవాటుపడి సమయాన్ని వృథా చేయకూడదు. ప్రస్తుతం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఫేస్‌బుక్, ఇతర సోషల్‌యాప్‌లకు అలవాటు పడ్డారు. దీని ఫలితంగా చదువులు పక్కదారి పడుతున్నాయి.
– కె. రామకృష్ణ ,
హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్, గండేపల్లి
కంచికచర్ల(నందిగామ): సామాజిక మాధ్యమం రెండు వైపులా పదునైన కత్తిలాంటిది. ఆశయం దిశగా సాగితే విజ్ఞానం, వినోదం ఉంటాయి. ఏ మాత్రం గురితప్పినా జీవితం తారుమారు అవుతుంది. యువత మార్కెట్‌లోకి ఏ ట్రెండ్ వచ్చినా అందిపుచ్చుకుంటుంది. వాటిని అనుసరిస్తుంది. ఫేస్‌బుక్‌లో లైకులు, కామెంట్లు, ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్స్‌లో కామెంట్లు, వాట్సాప్‌లో స్టేటస్‌లు ఇలా.. ఊహల గగనంలో విహరిస్తోంది. మరోవైపు ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌కు అడిక్ట్ అవుతోంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. వచ్చేనెల ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయాల్లో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ ఉంటే భవిష్యత్ పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.
ఫేస్‌బుక్ అంటే క్రేజ్..
ఫేస్‌బుక్ పేరు వింటేనే అందరిలో ఉత్సాహం మొదలవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫేస్‌బుక్ దగ్గరయింది. యువత విషయంలో చెప్పాల్సిన అవసరంలేదు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్ ఎక్కువయితే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరు. ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.
పరిమితి దాటితే ప్రమాదమే..
సామాజిక మాధ్యమాలను రోజుకు 30నిముషాలకు మించి వినియోగిస్తే ఇబ్బందులు లేవని వైద్యులు అంటున్నారు. కానీ చాలామంది గంటల తరబడి ఇందులోనే గడుపుతుంటారు. ప్రతిరోజూ వాటిని వినియోగించి ప్రస్తుతం పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఆ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నారు. అలాంటివారు తమకు తామే ఓ పరీక్ష పెట్టుకోవాలని వైద్యులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రతి పది నిముషాలకు ఒకసారి ఫోన్ వైపునకు చేయి వెళ్తుందా.. ఫేస్‌బుక్, వాట్సప్ చూడాలనిపిస్తుందా.. అనే విషయాలు తమను తామే ప్రశ్నించుకోవాలి. పరిస్థితి చేయి దాటినట్లు భావిస్తే.. వారం పదిరోజులు వాటికి దూరంగా ఉండేటట్లు ప్రయత్నించాలి. ఇలా ఉండకలిగితే నియంత్రణలో ఉన్నట్లే లెక్క. ఉండకపోతే వాటికి బానిస అయినట్లే!
మానసిక రుగ్మతలు..
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాలకు అలవాటు పడితే మానసిక రుగ్మతలతో పాటు కంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలామందికి సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.
పరీక్షల సమయం.. ఫోన్‌కు విరామం ఇచ్చేద్దాం
సోషల్ మీడియాతో సమయం వృథా ఆన్ లైన్ గేమ్స్‌తోనూ ఇబ్బందులే మితిమీరిన వినియోగంతో నిద్రలేమి, నేత్ర, మానసిక రుగ్మతలు

