
గుడివాడ–కంకిపాడు రహదారి పనులు చేస్తున్న కూలీలు
గుడివాడరూరల్: రెండు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్న గుడివాడ–కంకిపాడు రహదారి పునర్నిర్మాణ పనులకు మోక్షం లభించింది. గత ప్రభు త్వాలు ఈ రోడ్డును పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మాణం, విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. దీంతో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా మరమ్మతులకే కానీ పునర్నిర్మా ణానికి ఈ రోడ్డు నోచుకోలేదు. ఫలితంగా రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో రాకపోకలకు ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ రోడ్డు పునర్నిర్మాణం జరిగింది. ఆ తరువాత పాలకులు ఈ రోడ్డును పట్టించుకోలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మరమ్మతులను సైతం విస్మరించారు. గుడివాడ నుంచి పెదపారుపూడి వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గంలో రాకపోకలకు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. ఫలితంగా సెంట్రల్ రోడ్ ఫండ్ నిధుల నుంచి రూ.16 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గుడివాడ పట్టణంలోని కేటీఆర్ కళాశాల నుంచి మందపాడు రైల్వే గేటు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, గుడివాడ ఫ్లై ఓవర్ నుంచి పెదపారుపూడి వరకు 2.5 కిలో మీటర్ల మేర విస్తరణ, తారురోడ్డు, దానికి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
శరవేగంగా నిర్మాణ పనులు
గుడివాడ – కంకిపాడు రహదారి నిర్మాణంపై ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేటాఆర్ కళాశాల నుంచి మందపాడు రైల్వే గేటు వరకు రోడ్డు విస్తరణతో పాటు సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుడివాడ ఫ్లై ఓవర్ నుంచి కొంత మేర తారురోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. ఫ్లై ఓవర్ దిగువ నుంచి పెదపారుపూడి వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డును అనుకుని కాలువలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు త్వరితగతిన శిఽథిలావస్థకు చేరకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కాలువల వెంబడి రోడ్డుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు సైతం జరుగుతున్నాయి. రోడ్డు పనులు జరుగుతున్న తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి విస్తరణకు
రూ.16 కోట్ల మంజూరు
ముమ్మరంగా జరుగుతున్న
విస్తరణ పనులు