ఆర్మూర్: జిల్లాలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అవసరమైన ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి దివ్యాంగ విద్యార్థులను పరీక్షించారు. గుర్తించిన వారిలో 393 మంది చిన్నారులకు 565 సహాయ పరికరాలు మంజూరయ్యాయి. ఒక్కో చి న్నారికి అవసరాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎ క్కువ ఉపకరణాలు అందిస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలు ఖర్చు రూ.34 లక్షల 70 వేల 247 కాగా 60 శాతం ఏడీఐపీ పథకం ద్వారా, 40 శాతం స మగ్ర శిక్ష ద్వారా భరించనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు డీఈవో అశోక్, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీని వాస్‌రావు పర్యవేక్షణలో ఆర్టిఫీషియల్ లింబ్స్ మా న్యూఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్‌కో) సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, బ్రెయిలీ కిట్, ఎమ్మార్ కిట్‌లతో పాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలో గల ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పంపిణీ శిబిరాన్ని నిర్వహించనున్నారు. శిబిరానికి వచ్చే దివ్యాంగ విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్, భోజన సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. ఎంపికై న లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూఐడీ నంబర్, వైట్ రేషన్ కార్డు లేదా ఇన్‌కం సర్టిఫికెట్ జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది.
శిబిరం వేదిక : ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్,
బైపాస్ రోడ్డు, న్యూ హౌజింగ్‌బోర్డు
కాలనీ, నిజామాబాద్
సమయం : ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం 2 గంటల వరకు
లబ్ధిదారులైన దివ్యాంగ విద్యార్థులు : 393 మంది
మంజూరైన మొత్తం ఉపకరణాలు : 565
మొత్తం వ్యయం : రూ.34.70 లక్షలు
లబ్ధిదారులకు ఉచితంగా ఉపకరణాలు
ప్రత్యేక క్యాంపుల్లో గుర్తించిన ప్రతి చిన్నారికి అవసరమైన పరికరం అందేలా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
– పడకంటి శ్రీనివాస్ రావు, సహిత విద్యావిభాగం
జిల్లా కోఆర్డినేటర్, నిజామాబాద్
విద్యతోపాటు జీవన నైపుణ్యాలు అందిస్తాం
దివ్యాంగులైన పిల్లలకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు అందించడమే మా లక్ష్యం. ఈ ఉపకరణాలు వారి రోజువారీ జీవితాన్ని, చదువును సులభతరం చేస్తాయి. ఎంపిక చేసిన దివ్యాంగులు ఈ పరికరాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి.
– అశోక్, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్
నేడు జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం
ఆధ్వర్యంలో శిబిరం నిర్వహణ
పరికరాలు ఉచితంగా అందించనున్న సమగ్ర శిక్ష, అలిమ్‌కో ప్రతినిధులు


