రూ.1.56 కోట్లతో భవిత కేంద్రాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రూ.1.56 కోట్లతో భవిత కేంద్రాల అభివృద్ధి

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

నేడు మాక్లూర్‌, నిజామాబాద్‌ నార్త్‌లో నూతన భవనాల ప్రారంభోత్సవం

ఆర్మూర్‌: ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగుల)కు నాణ్యమైన విద్య, థెరపీ, పునరావాస సేవలు అందించేందుకు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లాలోని భవిత కేంద్రాలను బలోపేతం చేస్తోంది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతులు, రెనొవేషన్‌ పనుల కోసం జిల్లాలో మొత్తం రూ.1,55,64,000 ఖర్చు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సోమవారం మాక్లూర్‌, నిజామాబాద్‌ నార్త్‌ మండలాల్లో నిర్మించిన భవిత కేంద్రాలను ప్రారంభించనున్నారు.

కొత్త భవనాలకు రూ.64.74 లక్షలు

జిల్లాలో ఆరు కొత్త్త భవనాల నిర్మాణాలకు రూ. 64.74 లక్షలు కేటాయించారు. ఒక్కో కేంద్రానికి రూ.10.79 లక్షల చొప్పున మాక్లూర్‌ (మాదాపూర్‌), నిజామాబాద్‌ నార్త్‌, మోపాల్‌, రుద్రూర్‌, భీమ్‌గల్‌, నవీపేట్‌ మండలాల్లో నూతన భవిత కేంద్రాలను నిర్మిస్తున్నారు. మాక్లూర్‌, నిజామాబాద్‌ నార్త్‌ భవనాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

రూ.41.55 లక్షలతో మరమ్మతు పనులు

జిల్లాలో ఇప్పటికే పక్కా భవనాలు ఉన్న ఏడు మండల కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.41.55 లక్షలు మంజూరు చేశారు. ఆర్మూర్‌, బోధన్‌, మోర్తాడ్‌, నందిపేట్‌, నిజామాబాద్‌ సౌత్‌, సిరికొండ, ఎడపల్లి మండలాల్లో పనులు పూర్తయ్యాయి.

15 కేంద్రాల్లో రెనోవేషన్‌ పనులు

పక్కా భవనాలు లేని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక గదిని కేటాయించారు. 15 కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.3.29 లక్షల చొప్పున మొత్తం రూ.49.35 లక్షలు మంజూరు చేశారు. బాల్కొండ, చందూర్‌, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌ పల్లి, కమ్మర్‌పల్లి, కోటగిరి, మెండోరా, మోస్రా, ముప్కాల్‌, రెంజల్‌, వేల్పూర్‌, వర్ని, ఏర్గట్ల మండలాల్లో రెనోవేషన్‌ పనులు పూర్తయ్యాయి.

ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 4,857

పాఠశాలల్లో చేరిన పిల్లలు 4,707

స్పెసిఫిక్‌ లర్నింగ్‌ డిజేబిలిటీ 1,782

లో విజన్‌ 1,333

ఎర్లీ ఇంటర్వెన్షన్‌ 150

ఫిజియోథెరపీ 426

ఐఈఆర్పీలు 29

ఫిజియోథెరపిస్టులు 19

Advertisement
 
Advertisement
Advertisement