● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
ఆర్మూర్‌టౌన్: ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రజినికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కత్తి బాలకృష్ణ(40) అనే వ్యక్తి ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అంకాపూర్ గ్రామంలో ట్రాక్టర్ ఇటుకలోడ్‌ను దించి తిరిగి మగ్గిడికి వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ వద్ద టైర్ పేలిపోవడంతో ముందున్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ బాలకృష్ణ టైర్ కిందపడగా, మరో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఆస్పత్రిలో మృతిచెందగా, మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పెంచులమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


