● లారీలు రావడం లేదని డిచ్‌పల్లి
మండలం ధర్మారం(బీ)లో..
● దొడ్డు ధాన్యం తీసుకోవడం లేదని
మోర్తాడ్‌లో రాస్తారోకో
డిచ్‌పల్లి/మోర్తాడ్: ధాన్యం తరలించేందుకు లారీ లు రావడం లేదని, దొడ్డు ధాన్యం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్లెక్కారు. ధాన్యం కాంటా చేసి వారం రోజులవుతున్నా లారీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామ రైతులు డిచ్‌పల్లి – నిజామాబాద్ రోడ్డుపై, దొడ్డు ధాన్యం కొనుగోలు చేయడం లేదని మోర్తాడ్ రైతులు మోర్తాడ్ – గాండ్లపేట్ మధ్య జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు ప్రాంతాల్లో హైవేలపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్‌లు సతీష్‌రెడ్డి, కృష్ణ, ఎస్సైలు ఆరీఫ్, రాము రైతుల వద్దకు చేరుకుని వారి మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్‌లు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. మోర్తాడ్‌లో సర్పంచ్ భోగ ఆనంద్, వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు గోపిడి సత్యనారాయణ, రఘుపతిరెడ్డి, కొప్పుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


