● వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
సుభాష్‌నగర్: వైద్య, ఆరోగ్యశాఖలోని అధికారులు సమయపాలన పాటిస్తూ, క్షేత్రస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు సైతం పాటించేలా చూడాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీ స్థాయిల్లో రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు హాజరుకావాలన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించని మాలపల్లి, సాలూర, పెగడాపల్లి, రాకాసిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్హులైన బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 13 మీజిల్స్ రూబెల్లా కేసులు కొత్తగా నమోదయ్యాయని, సర్వే నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. కిశోర బాలికలకు జూన్ 10 వరకు స్నేహ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సహాయంతో చేపట్టే వేసవికాల శిబిరాల్లో భాగంగా ఆరోగ్య అవగాహన, చికిత్స కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లక్ష్యాలు చేరని, విధులపై నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.


