‘కార్పొరేట్’లో దక్కని అవకాశాలు
విద్యా సంవత్సరం అంతా పాఠాలు చెబుతూ అలసిపోయిన ప్రైవేట్ టీచర్లు మండుటెండలను లెక్క చేయకుండా రోడ్లెక్కారు. యాజమాన్యాలు అడ్మిషన్‌లు తీసుకురావాల్సిందేనని టార్గెట్‌లు పెట్టడంతో ఉద్యోగభద్రత కోసం నానాపాట్లు పడుతున్నారు. కరపత్రాలు చేతుల్లో పట్టుకుని ప్రతి ఇంటి గుమ్మాన్ని తడుతున్నారు.
ఖలీల్‌వాడి : వేసవి సెలవులంటే స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ టీచర్లకు పండగే. కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. స్కూల్ ప్రారంభం నుంచి విద్యార్థులకు మంచి మార్కులు, ర్యాంకులు తెప్పించేందుకు నానాతంటాలు పడిన ప్రైవేట్ టీచర్లలకు యాజమాన్యాలు కొత్త టార్గెట్లు ఫిక్స్ చేశాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల బాధ్యత ఇప్పటి నుంచే టీచర్లకు అప్పగించారు. కొన్ని విద్యాసంస్థలైతే కావాల్సిన అడ్మిషన్లు తీసుకురాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు టీచర్లు మండుటెండల్లో కరప త్రాలను పట్టుకొని వీధుల వెంట, విద్యార్థుల ఇంటింటికి అడ్మిషన్ల కోసం తంటాలు పడుతున్నారు.
ఏడాదిలో 10 నెలల జీతమే..
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 6,500 పైగా మంది ఉపాధ్యాయులు పని చేస్తుంటే, వీరిలో 70 శాతం మహిళలే ఉన్నారు. అయితే, ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ప్రైవే టు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. తక్కువ వేతనాలకే అధిక పనిగంటలతోపాటు సమయానికి జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయనే విమర్శలున్నాయి. తల్లిదండ్రుల వద్ద 12 నెలల ఫీజులు వసూలు చేసి, ఉపాధ్యాయులకు కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ లాంటి సౌకర్యాలేమీ కల్పించడం లేదనే విమర్శలున్నాయి.
రంగంలోకి విద్యార్థి సంఘాలు
ఒక్కో ప్రైవేటు టీచర్‌కు 5 నుంచి 10 అడ్మిషన్లను యాజమాన్యాలు టార్గెట్ విధిస్తున్నాయని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. టార్గెట్ పూర్తి చేయని టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. కార్పొరేట్ వ్యాపారంగా బోధన రంగం మారుతుందని, టీచర్లపై టార్గెట్ విధించే వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని వి ద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 293 ప్రైవేటు పాఠశాలున్నాయి. ఇందులో సుమారు 1.50 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. నగరంలో కార్పొరేట్ స్కూల్స్ సంఖ్య ప్రతి విద్యా సంవత్సరం పెరుగుతోంది. అయితే, ఇందులో పనిచేసే వారు ఎక్కువగా నార్త్ నుంచి వస్తున్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు వివిధ ఉన్నతస్థాయి పోస్టులను నార్త్ వాళ్లకే ఇస్తున్నారని, కొన్ని పోస్టులు మాత్రమే స్థానికులకు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు చివరకు ప్రైవేటు స్కూళ్లలో టీచింగ్ చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో కూడా స్థానికులకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.


