ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

107 మంది అభ్యర్థుల గైర్హాజరు

సెంటర్లను తనిఖీ చేసిన

అడిషనల్‌ కలెక్టర్‌, సీపీ

ఖలీల్‌వాడి: జిల్లాలో నీట్‌(నేషనల్‌ ఎల్జిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులను ఆదివారం ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు సెంటర్లలోకి అనుమతించగా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైనన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కళాశాల యూజీ బ్లాక్‌ లోని ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ బ్లాక్‌, కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీ, బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాక్లూర్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్‌ కార్డు, ఐడి ప్రూఫ్‌, లేటెస్ట్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో తమ వెంట తెచ్చుకుంటేనే లోనికి అనుమతించారు. అనంతరం బయోమెట్రిక్‌ నమోదు చేశారు. దీంతో వెంట ఫొటోలు తీసుకురాని వారు సమీపంలోని స్టూడియోలకు వెళ్లి ఫొటోలు తీసుకువచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పకడ్బందీ నిఘా మధ్య నీట్‌ కొనసాగిందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. 3,334 మంది అభ్యర్థులకు గాను 3,227 మంది హాజరుకాగా, 107 మంది గైర్హాజరయ్యారు. గిరిరాజ్‌ కళాశాల సెంటర్‌ను సీపీ సాయిచైతన్య, మాక్లూర్‌లోని సెంటర్‌ను అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తనిఖీ చేశారు.

టీజీఆర్‌జేసీ సెట్‌కు 6,312 మంది..

ఖలీల్‌వాడి: జిల్లాలో టీజీఆర్‌జేసీ సెట్‌–2026 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ ఎన్‌. గంగాశంకర్‌ ఆదివారం తెలిపారు. మొత్తం 7,997 మంది అభ్యర్థులకు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 6,312 మంది హాజరయ్యారని, 1,685 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు సమకూర్చి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసుశాఖ సమన్వయంతో పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement