ఆదాయ మార్గాలను అన్వేషించండి.. | - | Sakshi
Sakshi News home page

ఆదాయ మార్గాలను అన్వేషించండి..

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలపై దృష్టి పెడతాం

మోర్తాడ్‌(బాల్కొండ): గ్రామ పంచాయతీలు ఆర్థి కంగా పటిష్టం కావాలంటే సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషించుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సూచించింది. పన్ను, పన్నుయేతర ఆదాయం వల్ల పంచాయతీలకు ఆశించినంతగా లబ్ధి జరగకపోవడంతో కొత్త మార్గాల ఎంపికపై దృష్టి సారించేలా సర్పంచ్‌లు, కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఆర్‌డీ)లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఒక రోజు వర్క్‌షాప్‌ను శనివారం నిర్వహించారు. జిల్లా నుంచి సర్పంచ్‌లు భోగ ఆనంద్‌(మోర్తాడ్‌), కనకదుర్గ(వర్ని), రేఖ(నవీపేట్‌), లింగం(నందిపేట్‌), గాండ్ల రాజేశ్‌(బాల్కొండ)తోపాటు ఆయా జీపీల కార్యదర్శులు పాల్గొన్నారు. సాధారణంగా పంచాయతీల కు పన్ను, నాన్‌ట్యాక్స్‌లతోనే ఆదాయం లభిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కంపోస్టు ఎరువుల తయారీకి ప్రత్యేక షెడ్‌లను నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి వర్మి కంపోస్టును ఉత్పత్తి చేసేవారు. కంపోస్టు ఎరువు విక్రయంతో ఆదాయం లభించినప్పటికీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదనే అభిప్రాయం ఉంది. గ్రామ పంచాయతీలకు ఉన్న భూములను లీజుకు ఇవ్వడం, అవసరం ఉన్న చోట కాంప్లెక్స్‌లను నిర్మించి అద్దెకు ఇవ్వడం, వ్యాపార సంస్థలు ప్రచారం కోసం ఏర్పాటు చేసే హోర్డింగ్‌లకు ట్యాక్స్‌ వసూలు, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఉన్నతాధికారులు అవగాహన కల్పించినట్లు సర్పంచ్‌లు తెలిపారు.

ఒక రోజు నిర్వహించిన వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలపై దృష్టి సారిస్తాం. పంచాయతీలకు ఆదాయం పెరిగితే ప్రజలకు ఎన్నో రకాల సౌకర్యాలను మెరుగుపర్చవచ్చు. అనేక పంచాయతీలు ఆదాయ మార్గాల లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఆదాయమార్గాలను చూసుకుంటేనే మంచింది.

– భోగ ఆనంద్‌, సర్పంచ్‌, మోర్తాడ్‌

గ్రామ పంచాయతీలకు కేంద్ర

పంచాయతీరాజ్‌ సూచన

పన్నుతోపాటు ఇతర మార్గాలను ఆదాయం కోసం ఎంచుకోవాలి

ఎన్‌ఆర్‌డీలో ఆత్మనిర్భర్‌

పంచాయత్‌ వర్క్‌షాప్‌

పాల్గొన్న ఐదు గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు

Advertisement
 
Advertisement
Advertisement