అగ్ని ప్రమాదంలో కాలిపోతున్న దుకాణాలు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఆదివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. 16 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారి వెంట రేకుల షెడ్డులతో కూడిన దుకాణాలున్నాయి. వాటిలో పూలు, పండ్ల దుకాణాలు, పాన్ షాపులు, టీ పాయింట్‌లు, సెల్‌ఫోన్ రిపేర్ లాంటి మొత్తం 16 దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేకువజామున దుకాణాల వెనక భాగంలో మంటలు చెలరేగి అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు అంటుకున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఆ వరుసలోనే టీ పాయింట్, ఇతర దుకాణాల్లోని మొత్తం 3 సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటల ఉధృతి పెరిగి మొత్తం దుకాణాలు కాలిబూడి దయ్యాయి. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ట్రాన్స్‌ఫార్మర్ వద్దనున్న చెత్తకు నిప్పంటుకుని గానీ, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో గానీ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఆర్డీవో గిరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదు
కామారెడ్డి అర్బన్: ఇందిరా చౌక్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి రూ. 15 లక్షల నష్టం జరిగిందని ఎస్‌ఈ సాలియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, సాంకేతిక లోపం కారణం కాదని పేర్కొన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతవరకు ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
కామారెడ్డిలో 16 దుకాణాలు
అగ్నికి ఆహుతి..
రూ. కోటి వరకు ఆస్తినష్టం
జరిగిందంటున్న బాధితులు
రైల్వే స్టేషన్ ఎదురుగా ఘటన


