దోమకొండ: మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శనివారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలైయ్యాయి. కాలనీకి చెందిన ముద్దసాని కనకయ్య, బ్రహ్మయ్యగారి వెంకవ్వ, జంగం లిల్లీ, సాయవ్వతోపాటు మరో చిన్నారిపై కుక్కలు దాడిచేసినట్లు కాలనీవాసులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల క్రితం ఇదేవిధంగా పలువురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తరచు కుక్కల దాడితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
స్కూటీ దహనం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్‌లో గట్టడి శ్రీనివాస్ చెందిన స్కూటీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. శ్రీనివాస్ రోజూ మాదిరిగా తన స్కూటీని రాత్రి ఇంటి ఆవరణలో ఉంచి లోనికి వెళ్లిపోయాడు. కాగ అర్ధరాత్రి స్కూటీ దహనం అవుతున్న విషయాన్ని చుట్టుపక్కలవారు గమనించి అతడికి తెలిపారు. వెంటనే మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.


