పోగొట్టాలి.. లెక్కలంటే భయం
● చిన్నతనం నుంచే గణితంపై
ఆసక్తి పెంచాలి
● ఆధునిక జీవనానికి ఆలంబన గణితం
● నేడు జాతీయ గణిత దినోత్సవం
కమ్మర్‌పల్లి: జీవితంలో ఎన్నో అంశాలు లెక్కలతో ముడిపడి ఉంటాయి. కానీ, లెక్కలు అంటే దిక్కులు చూసే పిల్లలకు ఓ పట్టానా అర్థంకాని సబ్జెక్టుగా గణితం పేరు మోసింది. లెక్కలంటే భయంతో నేటితరం పిల్లలు ‘గణితపోభియా’ నుంచి దూరం కా వడం లేదు. సులభ సాధ్యమైన గణిత బోధన పద్ధతులతో చిన్నతనం నుంచే లెక్కలు నేర్పితే ఆసక్తి పెంపొంది గణిత మేధావులుగా ఎదిగే అవకాశం ఉంది. సోమవారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినం, జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
అనవసర భయాలతో ..
ఏ విద్యార్థినైనా భయపెట్టే పాఠ్యాంశాలలో గణితందే తొలిస్థానం. లెక్కల భయం విద్యార్థులలో ఆందోళనను పెంచి వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గణిత భావనల్ని మూర్త భావనలకు జోడించి చెప్పడం లేదు. గణితం అనాసక్తికరమైన, సృజనాత్మకత లేని సంక్లిష్టమైన విషయంగా చాలామంది విద్యార్థులు అపోహ పడతున్నారు. కొందరు ఉపాధ్యాయులు గణిత పాఠ్యపుస్తకాల్లో ఒక ఉదాహరణ ఇచ్చి దాని ఆధారంగా సాధన చేయాల్సిన లెక్కల జాబితాను ఇస్తున్నారు. దీంతో పిల్లలు ప్రాథమిక భావనలపై సరైన రీతిలో దృష్టి సారించడం లేదని గణిత మేధావులు చెప్తున్నారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో గణిత కార్యక్రమాలు
రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక స్థాయిలో 1, 2 తరగతులకు కృత్రిమ మేధ ద్వారా ప్రయోగాత్మకంగా ఒక్కొక్క పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టి గణిత బోధనను సులభతరం చేస్తున్నారు. ఏఎక్స్‌ఎల్ బోధనలో భాగంగా గణితంలో వెనుకబడిన విద్యార్థులకు కంప్యూటర్ల ద్వారా బోధన జరుగుతోంది. ఉన్నత పాఠశాలల్లో మండల, జిల్లా గణిత ఫోరంలా ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1018
చదువుతున్న విద్యార్థులు 1.04 లక్షలు
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు 496
చదువుతున్న విద్యార్థులు 1.36 లక్షలు
కొత్త పద్ధతులు పాటించాలి
గణిత బోధనలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు ఉపయోగించినప్పుడే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. క్లిష్టమైన గణిత విషయాలను సరళ పద్ధతిలో, అర్థవంతమైన ఉదాహరణలు ఇస్తూ బోధిస్తే విద్యార్థులు గణిత మేధావులుగా తయారవుతారు.
– పెద్ది మురళి, గణిత ఉపాధ్యాయుడు
పోగొట్టాలి.. లెక్కలంటే భయం


