నేషనల్ హెరాల్డ్ కేసు కుట్రపూరితం
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి
నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణ
నిజామాబాద్ రూరల్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై ఈడీ కేసు నమోదు చేయడం కుట్రపూరితమేనని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. తెలంగాణ పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ జిల్లా కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా నగశ్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఈడీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక సంస్థను కొనుగోలు చేయడానికి పార్టీ నిధులను దుర్వనియోగం చేశారనే ఆరోపణలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి 2012లో ఫిర్యాదు చేశారన్నారు. ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, నిధుల దుర్వినియోగం చేయలేదని సుప్రీం కోర్టు గతంలోనే కేసు రద్దు చేసిందన్నారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని అతన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు.


