అంచనాలను మించి ఎన్నికల ఖర్చు
● తుది విడతలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు రూ.30 కోట్లకు పైమాటే
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో తమ భవితవ్యం పరీక్షించుకున్న అభ్యర్థులు చేసిన ఖర్చులను అంచనా వేస్తే రూ.30 కోట్లకు దాటిపోతుంది. ఏ గ్రామంలో చూసినా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటా పోటీగా చేసిన ఖర్చు అభ్యర్థులకు తడిసి మోపైడెంది. తుది విడతలో 146 సర్పంచ్ స్థానాలకు, 1,130 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగగా ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రతి అభ్యర్థి కనీసం రూ.10లక్షలకు మించి ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మోర్తాడ్, నందిపేట్, ముప్కాల్‌లో మాత్రం సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు తలా రూ.కోటి దాటినట్లు సమాచారం. ఈ గ్రామాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేసినట్లు సమాచారం. బాల్కొండ, అంకాపూర్‌లో అభ్యర్థులు రూ.50లక్షల వరకూ ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వేల్పూర్ మండలం మోతెలో సర్పంచ్ పదవికి పోటీ పడిన అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రం రూ.80లక్షల వరకూ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంక్సాపూర్, దొన్కల్, దోంచంద, గుమ్మిర్యాల్‌లో సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించగా రూ. 20లక్షల నుంచి రూ. 35లక్షల వరకూ అభ్యర్థులు వీడీసీలకు విరాళంగా చెల్లించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఉప సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఒకరు రూ.22లక్షలు ఖర్చు చేశారు. మోర్తాడ్ మండలం పాలెం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి పోటీ పడిన అభ్యర్థి వార్డు సభ్యులకు రూ.2లక్షల చొప్పున అందించాడు. మరికొన్ని గ్రామాల్లో ఒక్కో వార్డు సభ్యునికి రూ.50వేల వరకూ ఇచ్చి ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీ పోరు ఈసారి రసవత్తరంగా సాగిందని చెప్పడానికి అభ్యర్థులు చేసిన ఖర్చులే నిదర్శనం.


