బుక్ చేసుకుంటేనే యూరియా
రైతులకు అందుబాటులో సరిపడా యూరియా
డొంకేశ్వర్(ఆర్మూర్)/డిచ్‌పల్లి : యూరియా పంపిణీ కోసం ఇప్పటికే ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. రైతులు పంపిణీ కేంద్రాలకు వెళ్లకుండానే మొబైల్ ఫోన్ ద్వారా యూరియాను బుక్ చేసుకునే సదుపాయం రానుంది. ముందుగా బుక్ చేసుకున్న వారే ఇక నుంచి యూరియా పొందే అవకాశం ఉంటుంది. నూతన విధానం ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాల రైతు వేదికల నుంచి వీసీకి వ్యవసాయ అధికారులు, డీలర్లు హాజరయ్యారు. రైతుకు ఉన్న వ్యవసాయ భూమి ఆధారంగా మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే యూరియా ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. దీని ద్వారా యూరియా పక్కదారి పట్టకుండా ఉంటుందని, రైతులు ఇంటి వద్దే ఉండి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. యాప్‌లో రైతు ఫోన్ నెంబర్, ఆధార్, పట్టాపాస్‌పుస్తకం, పంట పేరు వివరాలు ఎంట్రీ చేసిన వెంటనే ఎకరానికి కావాల్సిన బస్తాలను కావాల్సిన కేంద్రాల్లో కొనుగోలు చేసే ఆప్షన్లు ఉన్నట్లు తెలిపారు. సొసైటీలు, డీలర్ షాపుల్లో నిల్వలను కూడా చూసుకోవచ్చన్నారు. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఒకేసారి యూరియా పొందే అవకాశం ఉందన్నారు. పెద్ద రైతులు రెండు, మూడు విడతల్లో తీసుకోవచ్చన్నారు. ఎంపిక చేసుకున్న సొసైటీ, డీలరు షాపునకు బుకింగ్ ఐడీ నంబర్ పంపిన వెంటనే వాహనం ద్వారా ఇంటికి, పొలానికి యూరియా బస్తాలు వస్తాయన్నారు. డీఏపీ, ఇతర ఎరువులు సాధారణంగా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.
మోపాల్(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో యా సంగి సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీరా స్వామి తెలిపారు. మోపాల్ మండలకేంద్రంలో ని రైతువేదికలో గురువారం ఏఈవోలు, ఎరువుల దుకాణాల డీలర్లు, సొసైటీ సీఈవోలకు యూరియా బుకింగ్ మొబైల్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మా ట్లాడుతూ రైతులకు పంట ఆధారంగా అవసరమైన యూరియాను ఇకపై ఇంటి నుంచే బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
రైతులు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే అవకాశం
ఈ నెల 20 నుంచి సేవలు ప్రారంభం


