తెయూ–మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య ఎంవోయూ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కు దిరింది. ఈ ఎంఓయూపై తెయూ వైస్ చాన్స్‌లర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ డీజీఎం శేఖర్‌బాబు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ ఎంఓయూ వర్సిటీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం 17 డిసెంబర్ 2025 నుంచి 16 డిసెంబర్ 2026 వరకు చెల్లుబాటు అవుతుందన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో ఈ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందన్నారు. ఈ ఎంవోయూ ప్రకారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి, ఆమోదించిన కోర్సుల ప్రకారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ వృత్తి అవకాశాలను బలోపేతం చేయడానికి ప్లేస్‌మెంట్ ఆధారిత శిక్షణ, ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించి అర్హులైన విద్యార్థులకు అవసరమైన సాయం అందిస్తుందని వీసీ యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో ప్రి న్సిపాల్ ఎం ప్రవీణ్, ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ పాత నాగరాజు, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ డీజీఎం(లైవ్‌లీహుడ్ ఆపరేషన్స్–తెలంగాణ–ఆంధ్రప్రదేశ్) డీ శేఖర్‌బాబు, ప్రోగ్రామ్ మేనేజర్ ఎం సృజన్‌దా, ప్రొఫైలింగ్ ఆఫీసర్ డీ బాలమురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
● స్పందించిన సివిల్ సప్లయ్ సంస్థ
బోధన్: జిల్లాలో పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి తూకంలో వ్యత్యాసం లేకుండా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్న భోజన బియ్యంలో తరుగు శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా సివిల్ సప్లయ్ శాఖ అధికారి స్పందించారు.జిల్లాలో మండల స్థాయి 8 గోదాం ల ద్వారా 1159 పాఠశాల 9 వేల 6112 మంది విద్యార్థులకు 200 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం తమ సంస్థ నియమించిన రవాణా కాంట్రాక్టర్ ద్వారా సరఫరా జరుగుతుందని వివరించారు. గోదాంల్లో ఐదు మెట్రిక్ టన్నుల మిషన్ పై బియ్యం తూకం వేసి నిర్ధారించుకున్నంతరం ఈ–పాస్ యంత్రంపై ఎంఈవో లేదా పాఠశాల హెచ్‌ఎంల వేలి ముద్ర తీసుకుని బియ్యం సరఫరా ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. గోదాం నుంచి బియ్యం తీసుకునే సమయంలో తూకం నిర్ధారణ తనిఖీ,స్వీకరణ రిజిస్టర్ లో నమోదు,సరైన బరువు ఉన్నట్టు ధ్రువీకరణ సంబంధిత పాఠశాల అధికారులదే బాధ్యతని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశిచిందని తెలిపారు.
బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామస్తురాలు దండ్ల నర్సవ్వపై పాత కక్షలు మనస్సులో పెట్టుకుని తన మేన మామ కుటుంబీకులు దాడి చేశారని ఫిర్యాదు చేసిందని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ బుధవారం తెలిపారు. కోరుట్ల మండలంలోని ఐలపూర్ గ్రామానికి చెందిన నర్సవ్వ మేన మామ,ఆయన కోడలు,మనమరాలు,మనుమడు అసభ్య పదజాలంతో తిట్టి ,రాయితో కుడి చెవిపై కొట్టి తనను చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.నర్స వ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.
తెయూ–మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య ఎంవోయూ


