మద్యం.. మాంసం.. నగదు
● గత పదిరోజులుగా దావత్‌లు..
పలువిడతల్లో ఇంటింటికీ మాంసం
● చివరిరోజు ఓటర్లకు పోటాపోటీగా డబ్బుల పంపిణీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజకీయంగా చైతన్యవంతమైన పసుపు నేల ఆర్మూర్ డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల తుదివిడత పోలింగ్ బుధవా రం జరగనుంది. మొదటి రెండు విడతలతో పోలి స్తే ఈ విడతలో ఏకగ్రీవాల సంఖ్య తక్కువగా ఉంది. దీన్నిబట్టే డివిజన్‌లో ఎన్నికల వాతావరణం ఎ లా ఉందో అంచనా వేయొచ్చు. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 29, రెండో విడతలో 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మూడో విడతలో మాత్రం కేవలం 19 పంచాయతీ సర్పంచ్‌లు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వీడీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడంతో వేలంపాటలు కొంతమేరకు తగ్గాయి. ఏకగ్రీవాల్లో అత్యధికం అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. మొదటి రెండు విడతల్లో పోలింగ్ జరిగిన చాలా చోట్ల కాంగ్రెస్ మ ద్దతుదారులు ఇద్దరు, ముగ్గురు సైతం సర్పంచ్ పదవికి పోటీ చేసిన పంచాయతీలు గణనీయంగానే ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ మద్దుతుదారులే ఎక్కువగా గెలుపొందారు.
ఇదిలా ఉండగా తుది విడత పోలింగ్ జరగ నున్న ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో నోటి ఫికేషన్ వెలువడిన నాటి నుంచి మద్యం విచ్చలవిడిగా ప్రవహించింది. అభ్యర్థులు కులసంఘాల వా రీగా, గ్రూపుల వారీగా మద్యం సరఫరా చేశారు. దీంతో ప్రతిరోజూ దావత్‌లు జరిగాయి. అదేవిధంగా గత వారంరోజులుగా చాలా గ్రామాల్లో ఇంటింటికీ మాంసం ప్యాకెట్లు సరఫరా చేశారు. చివరి రో జైన మంగళవారం ఆయా గ్రామాల్లో పోటీని బట్టి నగదు పంపిణీ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో గెలిచేందుకు అభ్యర్థులు బాగా ఖర్చు చేస్తున్నారు. గ్రామంలో ఆధిపత్యం కోసం ఎదురు చూసే కొందరు నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు సైతం అభ్యర్థుల కోసం భారీగా ఖర్చు పెట్టారు. మరోవైపు రిజర్వ్‌డ్ సీట్లలోనూ ముఖ్య నాయకులు భారీగా ఖర్చు చేశారు.
అంకాపూర్‌కే పరిమితమైన ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
మొదటి రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు సైతం గట్టిగా పోటీ ఇచ్చారు. చెప్పుకోదగిన స్థాయిలో పంచాయతీలు గెలుచుకున్నారు. కీలకమైన ఎడపల్లి, పొతంగల్, మోస్రా, మోపాల్ మండల కేంద్రాలతోపాటు మరికొన్ని మేజర్ పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలో మొదటి రెండు విడతలకు మించి బీజేపీ మద్దతుదారులు గెలుచుకుంటారా లే దా అనే విషయమై జిల్లాలో చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాత్రం తన సొంత గ్రామమైన అంకాపూర్‌ను దాటి రాలే దు. ఎమ్మెల్యే తమకు సహకరించడంలేదని బీజేపీ అభ్యుర్థులు, కార్యకర్తలు పలుచోట్ల ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే అంకాపూర్‌లోనైనా సరే బీజేపీ మద్దతుదారును గెలిపించుకుంటారా లేదా అనేది వేచిచూడాలని పలువురు అంటున్నారు. ఇందుకోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


