పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
● పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
● ఆర్మూర్ ఏసీపీ జే వెంకటేశ్వర్‌రెడ్డి
ఆర్మూర్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆర్మూర్ ఏసీపీ జే వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆవరణలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఏసీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా సరిహద్దుల్లోని పొతంగల్, సాలూర , ఖండ్‌గావ్‌లో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాట్లు చేశామన్నారు. 24 ఎఫ్‌ఎస్‌టీ టీమ్స్‌తోపాటు నాలుగు ఎస్‌ఎస్‌టీ టీములను సైతం ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 100.24 లీటర్ల లిక్కర్‌ను, రూ.77,447 నగదును సీజ్ చేసి ఆరు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు కమ్మర్‌పల్లి, నందిపేట్‌లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భారతీయ న్యాయ సంహిత 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఐదుగురికంటే ఎక్కువ మంది గుమి గూడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్మూర్ రూరల్, భీమ్‌గల్ సీఐలు కే. శ్రీధర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, బాల్కొండ, నందిపేట్, వేల్పూర్, ముప్కాల్, మెండోర, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మాక్లూర్ ఎస్సైలు శైలేందర్, శ్యామ్‌రాజ్, సంజీవ్, కిరణ్‌పాల్, సుహాసిని, సందీప్, రాము, అనిల్‌రెడ్డి, రాజేశ్వర్, రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
60 సమస్యాత్మక ప్రాంతాలు
నిజామాబాద్ అర్బన్: పోలింగ్ జరిగే గ్రామాల్లో 1100 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. 60 సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. 194 మందిని తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్ చేశామని, 18 గన్‌లైసెన్సులు ఉండగా, 11 మందితో డిపాజిట్ చేయించామని తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించొద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


