పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఆర్మూర్, ఆలూర్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శన
ఆర్మూర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఆర్మూర్, ఆలూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంగళవారం ఆయన సందర్శించారు. కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందించాలని, చెక్‌లిస్టు ఆధారంగా సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికా రు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తి నా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూ చించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ కలెక్టర్‌తో కలిసి ఆలూర్, నందిపేట, డొంకేశ్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. వీరి వెంట ఆర్మూర్, ఆలూర్ తహసీల్దార్లు సత్యనారాయణ, రమేశ్, ఎంపీడీవోలు బీ.శివాజీ, గంగాధర్, డీఎల్‌పీవో శివకృష్ణ, ఎంఈవో రాజగంగారాం తదితరులున్నారు.


