సర్పంచ్‌లకు సమస్యల స్వాగతం
రెంజల్(బోధన్): పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రభుత్వం 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయత్ అనే మూడంచెల పంచాయత్‌రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వనరుల వినియోగం, శాశ్వాతమైన పరిపాలన అమలుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ రానురాను గాడి తప్పుతోంది. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు ఈ నెల 20న పదవి పగ్గాలు చేపట్టనున్నారు. అద్దె భవనాలు, పాత సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 140 జీపీలు అద్దె భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలు, గ్రామాభివృద్ధి కమిటీ భవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. తండాలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలకు గూడు లేకుండా పొయింది. ప్రభుత్వం పలు జీపీలకు నూతన భవనాలను మంజూరు చేసినా నిధుల కొరత కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయాయి.
సుమారు రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేక పల్లెపాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినా నిధులలేమి సమస్యతో ఇప్పటి వరకు పల్లెబాట పట్టలేదు. దీంతో స్థానిక కార్యదర్శులు ఎలాగోలా నెట్టుకువచ్చారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలో పరిపాలన అందించినా ప్రజాప్రతినిధులు లేక ప్రజలు సైతం సమస్యలను భరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు ఆలస్యమైనా పాలకవర్గాలు ఉంటే సర్పంచ్, వార్డు సభ్యులు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, వీధిదీపాలు, మురుగుకాల్వలను శుభ్రం చేయించే పరిస్థితి ఉండేది. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సమస్యలు వివరించి అదనపు నిధులు రాబట్టేందుకు పాలకవర్గాలు ప్రయత్నించేవారు. 20వ తేదీ అనంతరం సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పల్లె పాలనలో గాడిలో పడనున్నది.
జిల్లాలో గ్రామ పంచాయతీలు 545
అద్దె భవనంలో కొనసాగుతున్నవి 145
పక్కా భవనాలు ఉన్న జీపీలు 400
పలు పంచాయతీలకు
సొంత భవనాలు కరువు
అద్దె భవనాల్లో
కొనసాగుతున్న 145 జీపీలు
ప్రభుత్వ పాఠశాలలు,
అంగన్‌వాడీల్లో జీపీల నిర్వహణ
చెట్ల కిందే గ్రామసభలు
సర్పంచ్‌లకు సమస్యల స్వాగతం


