హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● స్థానిక ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: రెండేళ్లుగా అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మానాల గ్రామం, బడితండా, దేగవంత్ తండా, సర్పంచ్ తండా, వీరుని తండాల నుంచి నూతనంగా ఎన్నికై న సర్పంచులు బుర్ర శంకర్‌గౌడ్, మాలవత్ రాందాస్, సరితా తిరుపతి, మాలవత్ రజిత, ఉపసర్పంచులు గుగులోత్ వినోద్, యశోదా బానోత్,గుగులోత్ బలరాం, లావుడియా గంగాధర్, సుమారు 30 మంది వార్డు సభ్యులు, ఇతర నాయకులు సోమవారం వేల్పూర్‌లో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిని ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీ కార్డులు తీసుకొని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజల ఇంటికి వస్తున్నారని విమర్శించారు. అధికారంలో తామే ఉన్నాం, తమకు ఓటు వేయకుంటే గ్రామావృద్ధికి నిధులు రావు అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో మంజూరైన అనేక కుల సంఘాల భవనాలను ఈ ప్రభుత్వం రాగానే నిధులు ఇవ్వకుండా రద్దు చేసిందని ఆరోపించారు. మానాల, అక్కడి తండాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.


